30న తిరుపతిలో వైభవంగా కార్తీక మహా దీపోత్సవం

విస్తృతంగా ఏర్పాట్లు చేశామ‌న్న టీటీడీ ఈవో ముద్దాడ‌

hellotellugu-MahaDeepotsavaam

తిరుప‌తి : పవిత్ర కార్తీక మాసాన్ని పురస్కరించుకుని టీటీడీ ఆధ్వర్యంలో నవంబరు 30వ తేదీన తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవన ప్రాంగణంలోని పరేడ్ మైదానంలో కార్తీక మహాదీపోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా సాయంత్రం 5.30 గంటల నుంచి రాత్రి 8.45 గంటల వరకు భక్తిప్రపత్తులు వెల్లివిరిసేలా విశేష పూజలు, ఆధ్యాత్మిక, ధార్మిక, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించనున్నారు. మహా దీపోత్సవంలో భాగంగా దీప ప్రజ్వలన విశిష్టతను చాటుతూ ప్రత్యేక పూజలు, శ్రీనివాస అర్చన, విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం, శ్రీ మహాలక్ష్మీ పూజ నిర్వహించనున్నారు. అనంతరం హరిహర కార్తీక నృత్య రూపకం, భక్తిగీ తాలాపన, అష్టలక్ష్మీ వైభవం నృత్య ప్రదర్శనలు భక్తులను ఆధ్యాత్మిక ఆనందంలో ముంచెత్తనున్నాయి. చివరగా కుంభహారతి, నక్షత్రహారతి, మంగళ హారతి సమర్పించనున్నారు.

ఈ మహా దీపోత్సవంలో ప్రత్యేక ఆకర్షణగా వందలాది మంది మహిళలు సామూహికంగా దీపాలు వెలిగించి శ్రీ మహాలక్ష్మీ అమ్మవారికి లక్ష్మీ నీరాజనం సమర్పించనున్నారు. శ్రీ వేంకటేశ్వర స్వామివారు, శ్రీ మహాలక్ష్మీ అమ్మవారి దివ్య అనుగ్రహంతో సమస్త ప్రజలు సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని లోకక్షేమం కోసం ప్రత్యేక ప్రార్థనలు చేయనున్నారు. కార్తీక దీపారాధనలోని ఆధ్యాత్మిక వైశిష్ట్యాన్ని చాటుతూ, భక్తుల్లో భక్తిభావాన్ని, దైవచింతనను పెంపొందించే లక్ష్యంతో టీటీడీ ఈ మహాదీపోత్సవాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించనుంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తులు ఈ మహా దీపోత్సవాన్ని వీక్షించేందుకు వీలుగా ఎస్వీబీసీ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు.

Exit mobile version