హైదరాబాద్ : బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ ఆర్. కృష్ణయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పై నిప్పులు చెరిగారు. పేద పిల్లలను చదువుకు దూరం చేసేందుకు కుట్ర పన్నారని ఆరోపించారు. ఆర్. కృష్ణయ్య మీడియాతో మాట్లాడారు. ఇది కావాలని సీఎం, డిప్యూటీ సీఎంలు కుట్రకు తెర లేపారంటూ మండిపడ్డారు. విద్యను ఉన్నత వర్గాలకే పరిమితం అయ్యేలా, ప్రభుత్వ పరంగా ఫీజులు పెంచుతూ, రీ యింబర్స్ మెంట్ ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేయడం మంచి పద్దతి కాదన్నారు. రాబోయే రోజుల్లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు.
బీసీ, ఎస్సీ, ఎస్టీ స్టూడెంట్స్ చదువుకోకూడదనే దురుద్దేశంతోనే ఫీజు బకాయిలు చెల్లించడం లేదని షాకింగ్ కామెంట్స్ చేశారు ఆర్. కృష్ణయ్య. ఫీజు రీయింబర్స్‌మెంట్ సమస్యను తక్షణమే పరిష్కరించాలని లేకపోతే మంత్రులు, ఎమ్మెల్యేలు బయట తిరగలేరని వార్నింగ్ ఇచ్చారు. ఏం తమాషా చేస్తున్నారా అని నిలదీశారు. పేద పిల్లలు చదువుకుంటే కూడా ఓర్వలేక పోతున్నారని మండిపడ్డారు.. ప్రతి ఒక్కరూ రాష్ట్ర ఖజానాని దోచుకుంటున్నారని , వారి ఆటలు ఇక సాగవని అన్నారు బీజేపీ ఎంపీ ర్యాగ కృష్ణయ్య.
















