విద్య‌తోనే విజ్ఞానం, వికాసం : కందుల దుర్గేష్

ఏపీ మెగా పీటీఎం 3.0 కార్య‌క్ర‌మంలో మంత్రి

hellotelugu-KandulaDurgesh

అమ‌రావ‌తి : విద్య‌తోనే విజ్ఞానంతో పాటు విన‌యం క‌లుగుతుంద‌న్నారు రాష్ట్ర ప‌ర్యాట‌క , సినిమాటోగ్ర‌ఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్. శుక్ర‌వారం నిడదవోలు నియోజకవర్గం పెరవలి మండలం ముక్కామల గ్రామంలోని ఎస్.ఎన్.పి. జెడ్పీ హైస్కూల్‌లో నిర్వహించిన మెగా పీటీఎం 3.0 కార్యక్రమంలో పాల్గొన్నారు. విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ వినూత్న ఆలోచనతో రూపుదిద్దుకున్న ఈ సమావేశాలు పిల్లల చదువు, ప్రవర్తన, వ్యక్తిత్వ వికాసం, భవిష్యత్ లక్ష్యాలపై తల్లిదండ్రులు–ఉపాధ్యాయుల అనుసంధానాన్ని బలపరుస్తున్నాయని అన్నారు.

కార్యక్రమంలో భాగంగా విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసి, వారి ప్రోగ్రెస్ కార్డులు పరిశీలించారు కందుల దుర్గేష్‌. సైన్స్ ఎగ్జిబిషన్‌లో చిన్నారులు రూపొందించిన ప్రాజెక్టులను చూడటం ప్రత్యేక అనుభూతిని కలిగించింద‌న్నారు. కూటమి ప్రభుత్వం విద్యా వ్యవస్థలో విప్లవాత్మక సంస్కరణలకు పునాది వేస్తోందన్నారు. బేసిక్ పై బలమైన పట్టు, నైతిక విలువలు, సమగ్ర వ్యక్తిత్వ వికాసం ప్రతి విద్యార్థిలో పెరుగాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యమ‌ని స్ప‌ష్టం చేశారు కందుల దుర్గేష్‌. మొదటి తరగతి నుంచి ఇంటర్మీడియట్‌ వరకూ యూనిఫార్ముల పంపిణీ, నాణ్యమైన మధ్యాహ్న భోజనం, ప్రతిభావంతుల కోసం షైనింగ్ స్టార్స్ వంటి కార్యక్రమాలు విద్యార్థుల ఎదుగుదలకు దోహద పడుతున్నాయని అన్నారు.

పిల్లల అభివృద్ధి కోసం తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఇద్దరూ కలిసి పని చేయడం అత్యంత అవసరం అన్నారు. పిల్లల్లో లోపాలు, ప్రతిభ, అభిరుచులను నిరంతరం గమనించి, చదువుతో పాటు ఆటలు, పాటలు, కళలు, డిబేట్స్ వంటి రంగాల్లోనూ అవకాశాలు కల్పించాలని స్ప‌ష్టం చేశారు. గురువులే విద్యార్థులను అజ్ఞాన తిమిరం నుంచి విజ్ఞాన వెలుగుకు నడిపించే నిజమైన మార్గదర్శులు అని చెప్పారు కందుల దుర్గేష్. ఈ సందర్భంగా అమరావతిలో జరిగిన మాక్ అసెంబ్లీలో ఎమ్మెల్యేగా సత్తా చాటిన నిడదవోలు నియోజకవర్గానికి చెందిన పమ్మి దీపికను ప్రత్యేకంగా అభినందించారు.

Exit mobile version