పోలవరం జల విద్యుత్ కేంద్రంలో కీలక ముందడుగు

పుష్కరాల నాటికి ఆరు యూనిట్లు సిద్ధం చేయడమే లక్ష్యం

Hellotelug-Poalavaram

పోలవరం : పోలవరం జల విద్యుత్ కేంద్రం నిర్మాణ పనుల్లో మరో కీలక ముందడుగు పడింది. తొలి యూనిట్‌లో స్టాటర్‌ ఏర్పాటు ప్రక్రియను ప్రారంభించారు. ఏపీ జెన్‌కో (హైడల్‌) విభాగం డైరెక్టర్‌ సుజయ్‌కుమార్‌, నిర్మాణ సంస్థ మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రుక్చర్స్ లిమిటెడ్ (ఎం ఈ ఐ ఎల్ ) చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ సతీష్ బాబు అంగర , జనరల్‌ మేనేజర్‌ ప్రసేన్‌జిత్‌ మజుందార్‌, ఏపీ జెన్‌కో సీఈలు రవీంద్రరెడ్డి, విశ్వేశ్వరరావు తదితరులు కార్యక్రమంలో పాల్గొని పనుల పురోగతిని పరిశీలించారు. విద్యుత్‌ ఉత్పత్తి వ్యవస్థలో అత్యంత కీలకమైన స్టాటర్‌ ఏర్పాటు ప్రారంభం కావడం ద్వారా తొలి యూనిట్‌ విద్యుత్‌ ఉత్పత్తికి మరింత చేరువైనట్లయింది. ఇదే సమయంలో రోటర్‌ బిగింపు పనులు కూడా ప్రారంభమయ్యాయి.

పోలవరం జల విద్యుత్ కేంద్రంలో మొత్తం 12 యూనిట్లు నిర్మిస్తున్నారు. ఒక్కో యూనిట్‌ ద్వారా 80 మెగావాట్ల చొప్పున, మొత్తం 960 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి చేయనున్నారు. ప్రాజెక్టులో సివిల్‌, మెకానికల్‌, ఎలక్ట్రికల్‌ పనులను సమాంతరంగా చేపడుతూ పనులను వేగవంతం చేస్తున్నారు. జల విద్యుత్ కేంద్రంలో నీటి ప్రవాహంతో టర్బైన్‌ తిరిగినప్పుడు దానికి అనుసంధానమైన రోటర్‌ తిరుగుతుంది. రోటర్‌ చుట్టూ ఉండే స్థిర భాగమే స్టాటర్‌. రోటర్‌ తిరుగుతున్న సమయంలో స్టాటర్‌లో ఏర్పడే అయస్కాంత క్షేత్రం ద్వారా విద్యుత్‌ ఉత్పత్తి అవుతుంది. అందువల్ల జనరేటర్‌లో స్టాటర్‌ అత్యంత కీలకమైన భాగం. స్టాటర్‌ ఏర్పాటు పూర్తవడం యూనిట్‌ ఎలక్ట్రో-మెకానికల్‌ పనుల్లో ఒక ముఖ్యమైన దశగా అధికారులు పేర్కొన్నారు.

స్టాటర్‌లో విద్యుత్‌ ఉత్పత్తికి అవసరమైన కాయిల్స్‌, కోర్‌ వంటి కీలక భాగాలు ఉంటాయి. రోటర్‌–స్టాటర్‌ మధ్య అత్యంత కచ్చితమైన సమన్వయం ఉండేలా వీటి ఏర్పాటు చేస్తారు. యంత్ర సామర్థ్యం, విద్యుత్‌ ఉత్పత్తి స్థిరత్వం, దీర్ఘకాలిక పనితీరులో స్టాటర్‌ కీలకం కానుంది.

Exit mobile version