హైదరాబాద్ : తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మంగళవారం నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కానిస్టేబుల్ సౌమ్యను పరామర్శించారు. ఆమెకు భరోసా కల్పించారు. ఇదిలా ఉండగా నిజామాబాద్ లో గంజాయి ముఠా దాడిలో తీవ్రంగా గాయపడింది ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య. దీంతోను ఆమెను హుటా హుటిన హైదరాబాద్ కు తరలించారు. ఇక్కడ నిమ్స్ లో చికిత్స చేస్తున్నారు. విషయం తెలుసుకున్న కవిత సౌమ్యతో పాటు కుటుంబీకులను పలకరించారు. ఆరోగ్యం ఎలా ఉందంటూ అడిగారు. అనంతరం కల్వకుంట్ల కవిత మీడియాతో మాట్లాడారు. ఒక ఎక్సైజ్ కానిస్టేబుల్ ను చంపే ధైర్యం గంజాయి బ్యాచ్ చేసిందంటే ప్రభుత్వం అంటే వారికి ఏ మాత్రం భయం లేదని స్పష్టమవుతోందని అన్నారు.
డ్రగ్స్, గంజాయి ఫ్రీ చేస్తామని ఈ ప్రభుత్వం హామీ ఇచ్చిందని, కానీ గ్రామాల్లో కూడా ఫ్రీ గా గంజాయి, డ్రగ్స్ దొరికే పరిస్థితి వచ్చిందని ఆరోపించారు. దీనికి సీఎం, సర్కార్ బాధ్యత వహించాలని అన్నారు కవిత. స్కూల్ లోకి కూడా గంజాయి, డ్రగ్స్ తీసుకొచ్చి పిల్లలను పాడు చేస్తున్నారంటూ వాపోయారు. దీని కారణంగా మా ఆడవాళ్లే బాధితులుగా మారే పరిస్థితి ఉంటుందన్నారు. గృహ హింస ఘటనలు జరగటానికి డ్రగ్స్, గంజాయి కారణమవుతోందని ఆవేదన చెందారు కల్వకుంట్ల కవిత. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం మత్తు వదిలి డ్రగ్స్, గంజాయి మాఫియా పై వారి ప్రతాపం చూపాలన్నారు . అదే విధంగా ఎక్సైజ్, ఫారెస్ట్ సిబ్బందికి ఆయుధాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

















