తమిళనాడు : రాష్ట్ర ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కరూర్ లో జరిగిన సమావేశంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. గత డీఎంకే సర్కార్ ఎలా తనను అడ్డుకున్నదో, రాజకీయంగా ఎలా దెబ్బ తీయాలని చేసిందో పూసగుచ్చినట్టుగా చెప్పారు. ఈ సందర్బంగా కరూర్ ఘటనలో పలువురు ప్రాణాలు కోల్పోవడం పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కరూర్ తొక్కిసలాట బాధితుల కోసం టీవీకే స్మారక చిహ్నాన్ని ప్రకటించారు విజయ్. ఈ విషాదానికి అప్పటి డీఎంకే ప్రభుత్వమే బాధ్యత వహించాలని సంచలన కామెంట్స్ చేశారు. భవిష్యత్తులో తమిళనాడులో ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా నిరోధించేలా ఉంటుందని పేర్కొన్నారు.
సెప్టెంబర్ 2025లో 41 మంది ప్రాణాలను బలిగొన్న కరూర్ తొక్కిసలాట ఘటన తన జీవితంలో “అత్యంత బాధాకరమైన క్షణం”గా ఎప్పటికీ నిలిచి పోతుందని అన్నారు. ఈ మానవ తప్పిదం వల్ల జరిగిన విషాదానికి అప్పటి డీఎంకే ప్రభుత్వ హయాంలోని జిల్లా పోలీసులే కారణమని ఆయన ఆరోపించారు. వారు ఎవరి ఆదేశాలను పాటించడం వల్ల ఈ దుర్ఘటన జరిగిందో అని అనుమాన వ్యక్తం చేశారు. మనమందరం రకరకాల బాధలను అనుభవించి ఉంటాం. మన గాయాలను జీవితాంతం మోస్తూనే ఉంటాం. నా విషయానికొస్తే, నా జీవితంలో అత్యంత బాధాకరమైన క్షణం కరూర్ ఘటన అని వాపోయారు విజయ్.
















