చెన్నై : నీట్ యుజి 2026 లో చోటు చేసుకున్న లీకులపై విచారణ జరిపించాలని, దీనికి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీ లోని జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేపట్టిన విద్యార్థులు, నిరసనకారులకు బేషరతు మద్దతు ప్రకటించారు ప్రముఖ నటి జ్యోతిక. సంస్కరణలతో కూడిన విద్యా విధానం కోసం తాను తప్పకుండా సహకారం అందిస్తానని తెలిపారు. నీట్ పరీక్షలో జరిగినట్లు ఆరోపించబడుతున్న అక్రమాలు, పరీక్షా విధానంలో సంస్కరణలు , పేపర్ లీక్ కారణంగా నష్టపోయిన విద్యార్థులకు న్యాయం చేయాలని కోరుతూ విద్యార్థులు , వారికి మద్దతు తెలిపే ఇతర వ్యక్తులు జూన్ 20 నుండి జంతర్ మంతర్ వద్ద నిరసనలు చేస్తున్నారు. ధర్మేంద్ర ప్రధాన్ , పదవి నుంచి దిగిపోండి. రాజీనామా చేయండి. నేను విద్యార్థుల పక్షాన నిలబడుతున్నాను అని పేర్కొన్నారు.
జవాబుదారీతనానికి మద్దతుగా నిలుస్తున్నాను అని ప్రకటించారు జ్యోతిక. ప్రజాస్వామ్య భారతదేశం కోసం, సంస్కరణలతో కూడిన విద్యా విధానం కోసం నిలబడుతున్నానని స్పష్టం చేశారు. సోనమ్ వాంగ్‌చుక్, అభిజీత్ దిప్కే, సౌరవ్ దాస్ తల్లులుగా, మా పిల్లలను మీలాంటి వారిగా తీర్చిదిద్దాలని మేము కోరుకుంటున్నామని పేర్కొన్నారు. ‘జెన్-జెడ్’ తరం వారిగా మీ గురించి గర్వపడుతున్నామని తెలిపారు. కలిసి ఉంటేనే ‘మనం’ భారతదేశం అని మీరు నిరూపించారు. ఒత్తిడిని అధిగమించినందుకు ధన్యవాదాలు. మమ్మల్ని నిర్భయులుగా మార్చినందుకు ధన్యవాదాలు అని ఆమె జోడించారు. తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్న నెటిజన్ల తీరుపై ఆమె అసహనం వ్యక్తం చేశారు. విద్యార్థులకు మద్దతు తెలిపిన ప్రముఖులలో అలియా భట్, నసీరుద్దీన్ షా, రత్న పాఠక్ షా, షబానా అజ్మీ, ప్రకాష్ రాజ్, రాజ్‌కుమార్ రావు, రేవతి, టొవినో థామస్, అనురాగ్ కశ్యప్ , అరిజిత్ సింగ్ , తదితరులు ఉన్నారు.
