విశాఖపట్నం : నిరంతరం సమాజం కోసం పాటుపడే జర్నలిస్ట్‌లు దేశ ప్రగతి సాధకులని , వారి వల్లే ప్రజా సమస్యలు పరిష్కారానికి పూర్తి స్థాయలో అవకాశం లభిస్తుందని పలువురు ప్రముఖులు కొనియాడారు. ఆదివారం విఎంఆర్‌డిఎ చిల్డ్రన్స్ ఎరీనాలో వైజాగ్ మీడియా అవార్డ్స్, స్కూల్ ఆఫ్ థియేటర్ ఆర్ట్స్ ఆధ్వర్యంలో ప్రతిభకు ప్రోత్సాహం..2026 కార్యక్రమం అత్యంత ఘనంగా నిర్వహించారు. శ్రీలంక, బంగ్లాదేశ్‌తో పాటు స్వదేశ, విదేశాలకు చెందిన 35 మందికి కళాజీవ పురస్కారాలను అతిధులు చేతులు మీదుగా అందజేశారు. అలాగే పాత్రికేయ , మీడియా రంగంలో అత్యంత ప్రతిభా పాఠవాలు ప్రదర్శిస్తున్న 60 మందికి ఉత్తమ పాత్రికేయ అవార్డులను ప్రధానం చేయడం జరిగింది. ఇక ప్రతీ ఏటా మాదిరిగానే ఈ ఏడాది కూడా 150 మంది జర్నలిస్టుల పిల్లలకు ప్రతిభా పురస్కారాలను (ఉపకార వేతనాలు) ప్రముఖులు చేతులు మీదుగా అందచేసారు.
కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన బిజెపి అధికార ప్రతినిధి, దక్షిణాది రాష్ట్రాల ఇన్చార్జి రాజ్యసభ మాజీ సభ్యులు జీవీఎల్ నరసింహారావు విఎంఆర్డిఏ చైర్మన్ ప్రణవ్ గోపాల్ లు మాట్లాడుతూ…ప్రతీ ఏటా జర్నలిస్టులు, వారి కుటుంబ సభ్యుల కోసం ఈ తరహా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు తెలియ జేయడంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న అనేక కార్యక్రమాలను ప్రజలకు చేరువ చేసేది పాత్రికేయ మిత్రులేనన్నారు. సమాజ సంక్షేమానికి మరింతగా సేవలందించాలని పిలుపునిచ్చారు. అలాగే జర్నలిస్టుల సంక్షేమానికి ప్రభుత్వపరంగా తమ వంతు కృషి చేయడం జరుగుతుందన్నారు. జర్నలిస్ట్‌ల పిల్లలు ఎంతో మంది ఉన్నత విద్యను అభ్య సిస్తున్నారని, వీరంతా భవిష్యత్తులో అపారమైన ఉపాధి అవకాశాలు అంది పుచ్చుకుంటారన్నారు.. ప్రత్యేక అతిథిగా హాజరైన నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంకబ్రత బాగ్చి మాట్లాడుతూ జర్నలిస్టులు సమాజంలో నాలుగో స్తంభంగా గుర్తింపు పొందారన్నారు.. అయితే సంచలనాలకు తావు లేకుండా నిజాయితీగా కథనాలు ప్రజలకు అందించాలన్నారు.. అంతర్జాతీయ కళాకారులు విశాఖ రావడం ఎంతో అభినందనీయం అన్నారు.
















