పాలమూరు జిల్లా : కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల సమాచారాన్ని ప్రజలకు సమర్థవంతంగా చేర వేయడంలో జర్నలిస్టులు కీలక పాత్ర పోషించాలని సీనియర్ జర్నలిస్టు ముద్దం నరసింహస్వామి పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ పాలనలో 12 ఏళ్ల విశ్వాసం, వికాసం, ప్రజా సంక్షేమ కార్యక్రమాలపై దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న ప్రచార కార్యక్రమంలో భాగంగా ప్రెస్ ఇన్‌ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ), హైదరాబాద్ విభాగం ఆధ్వర్యంలో మహబూబ్‌నగర్‌లో జిల్లా జర్నలిస్టుల కోసం ప్రత్యేక ‘వార్తాలాప్’ మీడియా వర్క్‌షాప్ నిర్వహించింది.
పీఐబీ హైదరాబాద్ మీడియా అండ్ కమ్యూనికేషన్ అధికారిణి వర్గంటి గాయత్రి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా ప్రజా సంబంధాల అధికారి పీ. శ్రీనివాస్ పాల్గొన్నారు.ప్రధాన వక్తగా హాజరైన ముద్దం నరసింహస్వామి కృత్రిమ మేధ (ఏఐ) యుగంలో జర్నలిజం ఎదుర్కొంటున్న సవాళ్లు, అవకాశాలు, పాత్రికేయుల బాధ్యతలపై సమగ్రంగా వివరించారు. డిజిటల్ సమాచార విప్లవం వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో వార్తల ప్రచురణకు ముందు వాస్తవ నిర్ధారణ (ఫ్యాక్ట్-చెకింగ్) అత్యంత అవసరమని పేర్కొన్నారు. నైతిక విలువలు, ఖచ్చితత్వం, సమతుల్యతతో కూడిన వార్తా ప్రసారం ద్వారానే సమాజంలో విశ్వసనీయతను నిలబెట్టుకోవచ్చని సూచించారు.
అదే సమయంలో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధాన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, పాలన సంస్కరణలపై జర్నలిస్టులకు అవగాహన కల్పించారు. ప్రభుత్వ కార్యక్రమాల గురించి ప్రజల్లో చైతన్యం పెంపొందించడంలో మీడియా క్రియాశీలక భాగస్వామిగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వర్గంటి గాయత్రి మాట్లాడుతూ, ప్రజలకు ప్రభుత్వ సమాచారాన్ని పారదర్శకంగా, విశ్వసనీయంగా అందించడమే పీఐబీ ప్రధాన లక్ష్యమని తెలిపారు. ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు, సంక్షేమ పథకాలపై ప్రజలకు సరైన సమాచారం చేరేలా చేయడంలో పీఐబీ వంతెనలా పనిచేస్తోందని పేర్కొన్నారు.
డిజిటల్ యుగంలో తప్పుడు సమాచార వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో ఫ్యాక్ట్-చెకింగ్ ప్రాధాన్యంపై ఫ్యాక్ట్ చెక్ శిక్షకురాలు బీఎన్ సత్యప్రియ ప్రత్యేక అవగాహన కల్పించారు. వర్క్‌షాప్‌లో పాల్గొన్న జర్నలిస్టులు జర్నలిజం, సమాచార ప్రసారం, డిజిటల్ మీడియా ధోరణులపై నిపుణులతో చర్చించి తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు. మారుతున్న మీడియా రంగానికి అనుగుణంగా నైపుణ్యాలను పెంపొందించు కోవడం, వృత్తిపరమైన నైతిక ప్రమాణాలను పాటించడం, బాధ్యతా యుతమైన జర్నలిజాన్ని ప్రోత్సహించడం అవసరమని నిపుణులు సూచించారు. జిల్లా ప్రజా సంబంధాల అధికారి పీ. శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రజలకు కచ్చితమైన, విశ్వసనీయమైన సమాచారాన్ని సకాలంలో అందించడంలో మీడియా పాత్రను మరింత బలోపేతం చేయడానికి ఇటువంటి వర్క్‌షాప్‌లు దోహద పడతాయని అన్నారు.

















