జగిత్యాల జిల్లా : మాజీ సీఎం, బీఆర్ఎస్ బాస్ కేసీఆర్ సంచలన ప్రకటన చేశారు. జగిత్యాల వేదికగా జరిగిన బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్బంగా మాజీ మంత్రి టి. జీవన్ రెడ్డి గులాబీ కండువా కప్పుకున్నారు. అనంతరం వేలాది మందిని ఉద్దేశించి ప్రసంగించారు కేసీఆర్. చీకట్లో దడుచుకుంటే ఒక చెట్టే నీ చుట్టూరా అరణ్యమై భయపెడుతది… గుండె ధైర్యం ఉంటే అదే నీవెంట పెద్ద సైన్యమై నడుస్తుందని, ఇదే ప్రాంతానికి చెందిన కవి అలిశెట్టి ప్రభాకర్ అన్నారని గుర్తు చేశారు .జీవన్ రెడ్డి గుండె ధైర్యం ఉన్నోడని కితాబు ఇచ్చారు. ఆయన గురించి ఎక్కువ చెబితే మాకు మేము డబ్బా కొట్టుకున్నట్లు ఉంటుందన్నారు కేసీఆర్.
జీవన్ రెడ్డి నేను మంచి స్నేహితులం, పార్టీలు వేరైనా కలిసి పని చేశామన్నారు. జగిత్యాల ప్రజల దీవెనలతో ఆరు పర్యాయాలు ఎమ్మెల్యేగా జీవన్ రెడ్డి గెలిచారన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాల్లో జీవన్ రెడ్డికి అనేక మంది అభిమానులు ఉన్నారన్నారు. జగిత్యాల అభివృద్ధి కోసం నిరంతరం పాటుపడ్డారని కొనియాడారు. తను బీఆర్ఎస్ లో చేరితే బీఆర్ఎస్ పార్టీకి లాభం చేకూరుతుందని సర్వేలు చెప్పాయన్నారు. ఎమ్మెల్యేగా జీవన్ రెడ్డి ఓడిపోయినా.. పట్టభద్రుల ఎమ్మెల్సీగా ఆయన్ని ఈ ప్రాంత ప్రజలు గెలిపించారన్నారు. ఇది ఆయనకు ఉన్న నిబద్దతకు నిదర్శనం అన్నారు. జీవన్ రెడ్డికి పదవులు కొత్తేం కాదన్నారు. ఆయననే వెదుక్కుంటూ పదవులు వచ్చాయన్నారు. తను నేను మంచి స్నేహితులం అని చెప్పారు కేసీఆర్. ఈ సందర్బంగా సంచలన ప్రకటన చేశారు కేసీఆర్. జీవన్ రెడ్డికి అత్యంత కీలకమైన ప్రధాన కార్యదర్శి పదవిని ఇస్తున్నట్లు వెల్లడించారు.

















