అమరావతి : ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని ఏకి పారేశారు రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత. ఇవాళ తను మీడియాతో మాట్లాడారు. మాది అభివృద్ధి రాజకీయాలు తప్పా అలజడి రాజకీయాలు కాదన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో తమ ప్రభుత్వం పెట్టుబడులు, పరిశ్రమలు, ఉద్యోగాల కల్పన, పోలవరం, అమరావతి, సూపర్ సిక్స్ హామీల అమలు, మహిళల భద్రత, శాంతి భద్రతల పరిరక్షణకు అంకితభావంతో పని చేస్తోందని చెప్పారు.
ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికీ నిరసన తెలిపే హక్కు ఉందని అన్నారు వంగలపూడి అనిత. కానీ పరామర్శల పేరుతో రాజకీయ ఉద్రిక్తతలు సృష్టించడం, పోలీసుల విధులకు ఆటంకం కలిగించడం, మహిళా పోలీసుల పట్ల అనుచితంగా ప్రవర్తించడం ఎట్టి పరిస్థితుల్లోనూ సమర్థనీయం కాదన్నారు. మాజీ సీఎం జగన్ రెడ్డి అనాలోచితంగా కామెంట్స్ చేయడం పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు అనిత వంగలపూడి. చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే వారిపై చట్టం తన పని తాను చేస్తుందని వార్నింగ్ ఇచ్చారు.
యువత భవిష్యత్తును కాపాడేందుకు ఈగల్ టీం ద్వారా గంజాయి, మాదకద్రవ్యాల నిర్మూలనపై కఠిన చర్యలు తీసుకుంటున్నాం అని చెప్పారు. యువత చేతిలో గంజాయి కాదు ఉద్యోగం ఉండాలన్నారు. మాదకద్రవ్యాలు కాదు కావాల్సింది నైపుణ్యం ఉండాలని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో అమలవుతున్నది రెడ్‌బుక్ రాజ్యాంగం కాదని, డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ అందించిన భారత రాజ్యాంగమేనని చెప్పారు. చట్టం ముందు అందరూ సమానమేనని అన్నారు అనిత వంగలపూడి . మాకు రాజకీయ అలజడిపై ఆసక్తి లేదు. మా ఫోకస్ ఒక్కటే… అభివృద్ధి, సంక్షేమం, మహిళల భద్రత, యువత భవిష్యత్తు, రాష్ట్ర ప్రగతి. ఆడబిడ్డల భద్రత ప్రతి కుటుంబం బాధ్యత మాత్రమే కాదు… ప్రభుత్వంగా మా అత్యున్నత ప్రాధాన్యం కూడా అని పేర్కొన్నారు.
