ఏలూరు జిల్లా : వైఎస్సార్సీపీ బాస్ జగన్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో కూటమి సర్కార్ నిర్వాకంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. ఇకపై ప్రతి వారం ఒక నియోజకవర్గం కార్యకర్తలతో భేటీ అవుతానని వెల్లడించారు. ఈ సందర్బంగా శుక్రవారం జగన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ప్రజల్లో ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత పెరిగిందన్నారు. ఏలూరులో పార్టీ కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో మాజీ ముఖ్యమంత్రి పాదయాత్రకు సంబంధించి కీలక ప్రకటన చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసిందని ఆరోపించారు. ఏ వర్గానికీ మేలు చేయలేదని విమర్శించారు.
అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, అయినా సోయి లేకుండా సీఎం చంద్రబాబు నాయుడు వ్యవహరిస్తున్నాడని మండిపడ్డారు. వ్యక్తిగత ప్రచారానికి కేటాయించినంత సమయం ప్రజల సమస్యల పరిష్కారంపై చూపడం లేదన్నారు జగన్ రెడ్డి. ప్రస్తుతం అన్ని రంగాలు నిర్వీర్యమై పోయాయని, దీనికి ప్రధాన కారణం ఏపీ కూటమి సర్కార్ అంటూ స్పష్టం చేశారు . రోజు రోజుకు సర్కార్ పై జనం భగ్గుమంటున్నారని ధ్వజమెత్తారు. ప్రస్తుతం అందరూ జగన్ ఉంటే బాగుండేదన్నారు. ఈ విషయం పైనే సర్వత్రా ప్రతి ఇంట్లో చర్చ జరుగుతోందన్నారు. ఈ ప్రభుత్వానికి మిగిలింది ఇంకో మూడేళ్లేనని అన్నారు.


















