అమరావతి : రాష్ట్ర రాజకీయాల్లో వెన్నుపోటు గురించి మాట్లాడే నైతిక హక్కు జగన్ మోహన్ రెడ్డికి లేదని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తీవ్రస్థాయిలో విమర్శించారు. వెన్నుపోటుకు కర్త, కర్మ, క్రియ జగన్‌నేనని, ఆ పదానికి పేటెంట్ హక్కులు ఎవరైనా ఇవ్వాలంటే అది జగన్‌కే ఇవ్వాలని ఎద్దేవా చేశారు. బుధవారం మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో మంత్రి మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రజలు గతాన్ని ఒక్కసారి గుర్తు చేసుకోవాలని కోరుతున్నాను. రాష్ట్ర విభజన తర్వాత 2014లో ఆంధ్రప్రదేశ్ తీవ్ర సంక్షోభంలో పడింది. రాజధాని లేదు, ఆదాయం లేదు, పరిశ్రమలు లేవు, ఉద్యోగ అవకాశాలు లేవు. అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో రాష్ట్రాన్ని గాడిలో పెట్టగల సమర్థ నాయకుడు కావాలని ప్రజలు భావించి తెలుగుదేశం పార్టీకి అవకాశం ఇచ్చారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో అభివృద్ధి, సంక్షేమాన్ని రెండు కళ్లుగా భావించి రాష్ట్ర పునర్నిర్మాణానికి శ్రీకారం చుట్టాం.
ఐదేళ్లలో ప్రజలు ఊహించని స్థాయిలో అభివృద్ధి చేసి ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే ఆదర్శ రాష్ట్రంగా నిలబెట్టేందుకు కృషి చేశాం అన్నారు అచ్చెన్నాయుడు. అయితే 2019లో అబద్ధాలు, అసత్యాలు, సాధ్యం కాని హామీలతో ప్రజలను మోసం చేసి జగన్ అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఐదేళ్లపాటు రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో వెనక్కి నెట్టారు. మాట్లాడే స్వేచ్ఛ లేకుండా చేశారు. ప్రశ్నించిన వారిపై కేసులు పెట్టారు. వ్యవస్థలను నిర్వీర్యం చేశారు. దళితులు, గిరిజనులు, బలహీన వర్గాలపై దమనకాండ సాగించారని తెలిపారు. రాష్ట్ర భవిష్యత్తును తాకట్టు పెట్టి లక్షల కోట్ల అప్పులు చేసి ఆంధ్రప్రదేశ్‌ను ఆర్థికంగా దివాళా అంచుకు చేర్చారు . ప్రభుత్వ ఆస్తులు, కార్యాలయాలు, మార్కెట్లు, వివిధ ఆదాయ వనరులను తాకట్టు పెట్టి భారీ స్థాయిలో అప్పులు తెచ్చింది. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను సంక్షోభంలోకి నెట్టింది. మద్యం ఆదాయాన్ని కూడా భవిష్యత్ తరాలకు భారం అయ్యేలా ఉపయోగించారని అన్నారు.
