అమరావతి : రాష్ట్రంలోని రైతుల సంక్షేమం, వ్యవసాయాభివృద్ధి, రైతు కుటుంబాల ఆర్థిక భద్రత విషయంలో కూటమి ప్రభుత్వం అత్యంత బాధ్యతాయుతంగా వ్యవహరిస్తోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను కొందరు రాజకీయ ప్రయోజనాల కోసం వక్రీకరిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రైతు ఆత్మహత్యల విషయంలో వైసీపీ సానుకూల పత్రికలో పనిగట్టుకుని అబద్ధాలను ప్రచురిస్తున్నారని మంత్రి మండిపడ్డారు. జూన్ 2024 నుండి ఇప్పటి వరకు 540 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారన్న ప్రచారం నిజం కాదని తెలిపారు. త్రిసభ్య కమిటీ విచారణ అనంతరం గత రెండేళ్ల కాలంలో 148 కేసులు మాత్రమే రైతు ఆత్మహత్యలుగా నిర్ధారణ అయినట్లు వెల్లడించారు. వ్యవసాయ కారణాల వల్ల బలవన్మరణానికి పాల్పడిన రైతుల కుటుంబాలకు ప్రభుత్వం రూ.7 లక్షల ఎక్స్‌గ్రేషియా అందజేస్తోందని తెలిపారు.
ఇప్పటికే 148 కేసుల్లో 112 మంది రైతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా మంజూరు చేసేందుకు బిల్లులు సమర్పించామని, మిగిలిన కేసులను కూడా త్వరితగతిన పరిష్కరిస్తామని చెప్పారు. గత ప్రభుత్వంలో మరణించిన 81 మంది రైతులకు పరిహారం నగదు ఇవ్వలేదని కూటమి ప్రభుత్వం వచ్చినాక 5.67 కోట్ల నగదును సంబంధిత రైతుల కుటుంబాలకు చెల్లించామని మంత్రి తెలిపారు. రైతుల ఆర్థిక భద్రత కోసం కూటమి ప్రభుత్వం అన్నదాత సుఖీభవ–పీఎం కిసాన్ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేస్తోందని మంత్రి తెలిపారు. ఈ పథకం ద్వారా ప్రతి అర్హత రైతు కుటుంబానికి సంవత్సరానికి రూ.20,000 ఆర్థిక సహాయం అందజేస్తున్నామని చెప్పారు. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం రూ.14,000, కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ ద్వారా రూ.6,000 అందజేస్తోందని వివరించారు. 2025–26 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలోని 46.86 లక్షల రైతు కుటుంబాలకు మూడు విడతలుగా మొత్తం రూ.8,985.41 కోట్లు విడుదల చేసినట్లు తెలిపారు. ఇందులో రాష్ట్ర ప్రభుత్వ వాటా రూ.6,560.18 కోట్లు కాగా, కేంద్ర ప్రభుత్వ వాటా రూ.2,425.23 కోట్లు అని పేర్కొన్నారు.
