న్యూఢిల్లీ : నీట్ యుజి 2026 పరీక్షను తిరిగి ఈనెల 21న దేశ వ్యాప్తంగా నిర్వహించేందుకు రెడీ అయ్యింది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ. ఇదిలా ఉండగా దీనిని తిరిగి నిర్వహించడాన్ని సవాల్ చేస్తూ భారత దేశ సర్వోన్నత ప్రధాన న్యాయ స్థానంలో పిటిషన్ దాఖలైంది. ఇవాళ విచారణ చేపట్టిన కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ కేసు విచారణను వచ్చే నెల జూలైలో విచారించనున్నట్లు తెలిపింది. . కోర్టు సాధారణ కార్యకలాపాలు తిరిగి ప్రారంభమైన తర్వాత జస్టిస్ పి.ఎస్. నరసింహ నేతృత్వంలోని ధర్మాసనం ఈ పిటిషన్‌ను విచారిస్తుందని కోర్టు పేర్కొంది. మే 3న జరిగిన నీట్ యుజి 2026 పరీక్షలో ప్రశ్నపత్రం లీక్ అయిందన్న ఆరోపణల నేపథ్యంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ మే 12న ఆ పరీక్షను రద్దు చేసింది. ప్రస్తుతం ఈ వ్యవహారంపై సీబీఐ దర్యాప్తు చేస్తోంది .
జూన్ 21న రీ-టెస్ట్ నిర్వహించడానికి షెడ్యూల్ చేయబడింది. రీ-టెస్ట్ నిర్ణయాన్ని రద్దు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్ విచారణకు వచ్చింది. ఇతర పిటిషన్లను కూడా జస్టిస్ నరసింహ నేతృత్వంలోని ధర్మాసనమే ఇప్పటికే పరిశీలిస్తోంది. భవిష్యత్తులో జరిగే జాతీయ స్థాయి పరీక్షల కోసం సురక్షితమైన సాంకేతికతతో కూడిన డిజిటల్ పరీక్ష , మూల్యాంకన విధానాలను (ఎన్‌క్రిప్టెడ్ డిజిటల్ ప్రశ్నల పంపిణీ వ్యవస్థలు, బయోమెట్రిక్ ధృవీకరణ, ఏఐ ఆధారిత పర్యవేక్షణ , సురక్షిత కంప్యూటర్-ఆధారిత పరీక్షా మౌలిక సదుపాయాలతో సహా) అమలు చేయాలని కేంద్రం , ఇతర సంబంధిత వర్గాలను ఆదేశించాలని ఈ కొత్త పిటిషన్ కోరింది. అలాగే ఎన్టీఏ పనితీరులో ఉన్న నిర్మాణాత్మక, సంస్థాగత , నిర్వహణపరమైన లోపాలను పరిశీలించడానికి ఒక స్వతంత్ర నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని ఆదేశించాలని కూడా ఈ పిటిషన్ కోరింది.
