అమరావతి : మాజీ సీఎం జగన్ రెడ్డికి రైతుల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు. పంటల బీమా విధానంలో మార్పులు మంత్రివర్గ ఉపసంఘం సిఫారసుల మేరకే చేపట్టామని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. ఖరీఫ్–2024లో ఈ-పంట ఆధారంగా ఉచిత పంటల బీమా అమలు చేయగా, రబీ 2024–25 నుంచి రైతులను భాగస్వాములను చేస్తూ స్వచ్ఛంద నమోదు విధానాన్ని అమలు చేస్తున్నామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం కూడా ఖరీఫ్–2020 నుంచి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనను దేశవ్యాప్తంగా స్వచ్ఛంద పథకంగా అమలు చేస్తోందని గుర్తు చేశారు. ఈ పథకంలో రైతుల ప్రీమియం వాటా ఖరీఫ్ ఆహార, నూనె గింజల పంటలకు గరిష్ఠంగా 2 శాతం, రబీ పంటలకు 1.5 శాతం, వార్షిక వాణిజ్య, ఉద్యాన పంటలకు 5 శాతం మాత్రమేనని తెలిపారు. మిగిలిన ప్రీమియం సబ్సిడీని వర్తించే నిబంధనల ప్రకారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 50:50 నిష్పత్తిలో భరిస్తున్నాయని వివరించారు.
పెండింగ్ బీమా క్లెయిమ్‌ల పరిష్కారానికి ప్రభుత్వం పక్కా కార్యాచరణ రూపొందించిందని మంత్రి తెలిపారు. పీఎంఎఫ్‌బీవై మార్గదర్శకాల ప్రకారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రీమియం సబ్సిడీ వాటాలు అందిన అనంతరం బీమా కంపెనీలు క్లెయిమ్‌లను పరిష్కరిస్తాయని వివరించారు. రబీ 2022–23 నుంచి ఖరీఫ్–2025 వరకు పెండింగ్‌లో ఉన్న రాష్ట్ర వాటా ప్రీమియం సబ్సిడీని మూడు ఆర్థిక సంవత్సరాల్లో చెల్లించేందుకు ప్రతిపాదనలు సమర్పించామన్నారు అచ్చెన్నాయుడు. ఈ మేరకు రబీ 2022–23 పెండింగ్ ప్రీమియం కోసం రూ.500 కోట్లు విడుదల చేయగా, అందులో రూ.250 కోట్లు ఇప్పటికే బీమా కంపెనీలకు చెల్లించామని, మిగిలిన బిల్లులు పరిశీలనలో ఉన్నాయని తెలిపారు. రాష్ట్ర వాటా చెల్లింపులకు అనుగుణంగా సంబంధిత సీజన్ల రైతులకు పరిహారం దశలవారీగా అందుతుందని వివరించారు . ఖరీఫ్–2026 నుంచి కేంద్ర ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ప్రత్యేక ఎస్క్రో ఖాతా విధానాన్ని అమలు చేస్తున్నామని మంత్రి పేర్కొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వ అంచనా ప్రీమియం వాటాలో కొంత భాగాన్ని ముందుగానే జమ చేసేందుకు ఈ ఖాతాలో మరో రూ.250 కోట్లు జమ చేశామని తెలిపారు. ఇందులో నుంచి ఖరీఫ్–2026కు రూ.83 కోట్లు, రబీ 2026–27కు రూ.44 కోట్లు అడ్వాన్స్ ప్రీమియంగా బీమా కంపెనీలకు చెల్లించామన్నారు. పంటల బీమా క్లెయిమ్‌ల లెక్కింపునకు అవసరమైన పంట కోత ప్రయోగాలు (CCEs), యెస్-టెక్ (YES-TECH) ఆధారిత దిగుబడి అంచనాలు, వాటి తనిఖీ, ధ్రువీకరణ ప్రక్రియలను త్వరితగతిన పూర్తి చేసి ఖరీఫ్–2026కు సంబంధించిన అర్హమైన పరిహారాన్ని రైతులకు అందించేందుకు చర్యలు చేపడుతున్నామని వివరించారు. ప్రకృతి విపత్తుల వల్ల పంటలు నష్టపోయిన రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతోందని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. 2024 జూలై, ఆగస్టు–సెప్టెంబర్ నెలల్లో సంభవించిన వరదలు, భారీ వర్షాలు, 2025 మార్చిలో కురిసిన అకాల వర్షాల కారణంగా నష్టపోయిన 2.07 లక్షల మంది రైతులకు రూ.310.30 కోట్ల ఇన్పుట్ సబ్సిడీ అందించామని వెల్లడించారు.
రెవెన్యూ (DM-II) శాఖ జీవో ఎంఎస్ నంబర్ 1, తేదీ 07.01.2025 ద్వారా SDRF/NDRF ప్రమాణాల కంటే అధికంగా రాష్ట్ర సహాయ రేట్లను నిర్ణయించామని తెలిపారు. వరి, పత్తి, వేరుశనగ, చెరకు పంటలకు హెక్టారుకు సబ్సిడీని రూ.17,000 నుంచి రూ.25,000కు పెంచామని, ఎంపిక చేసిన ఇతర పంటలకు హెక్టారుకు రూ.15,000 చొప్పున పెంచిన రాష్ట్ర రేటు వర్తిస్తుందని వివరించారు. పంటల బీమా పరిహారం బీమా చేసిన విస్తీర్ణానికి వర్తిస్తుందని, అయితే ఇన్పుట్ సబ్సిడీ పొందేందుకు బీమా తప్పనిసరి కాదని స్పష్టం చేశారు. బీమా ఉన్నా లేకపోయినా 33 శాతం లేదా అంతకంటే ఎక్కువ పంట నష్టం నమోదైన రైతులకు నిబంధనల ప్రకారం గరిష్ఠంగా 2 హెక్టార్ల అర్హమైన నష్ట విస్తీర్ణం వరకు ఇన్పుట్ సబ్సిడీ వర్తిస్తుందని తెలిపారు.
ఖరీఫ్–2026లో కరువు, అర్ణబ్, మురాసు తుఫాన్లు, సెప్టెంబర్ వరదలు, భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న వ్యవసాయ పంటలకు సంబంధించి క్షేత్రస్థాయి నష్టం నమోదు పూర్తయిందని మంత్రి వెల్లడించారు. నాలుగు విపత్తులకు కలిపి 14,59,225 మంది రైతులకు చెందిన 12,06,269.84 హెక్టార్లలో పంట నష్టం నమోదైందని, పెంచిన రాష్ట్ర సహాయ రేట్ల ప్రకారం రూ.2,532.89 కోట్ల ఇన్పుట్ సబ్సిడీ అవసరమని అంచనా వేసినట్లు తెలిపారు. ఖరీఫ్–2026 కరువు కారణంగా 20 జిల్లాల్లో 9,87,231 మంది రైతులకు చెందిన 9,30,899.69 హెక్టార్లలో పంట నష్టం నమోదైందని, ఇందుకు రూ.1,863.23 కోట్లు అవసరమని వివరించారు. అక్టోబర్‌లో సంభవించిన అర్ణబ్ తుఫాను కారణంగా 13 జిల్లాల్లో 3,82,866 మంది రైతులకు చెందిన 2,24,167.09 హెక్టార్లలో నష్టం నమోదైందని, రూ.559.77 కోట్లు అవసరమని తెలిపారు. నవంబర్‌లో సంభవించిన మురాసు తుఫాను కారణంగా 9 జిల్లాల్లో 52,402 మంది రైతులకు చెందిన 32,621.68 హెక్టార్లలో పంట నష్టం నమోదైందని, ఇందుకు రూ.78.65 కోట్లు అవసరమని పేర్కొన్నారు. సెప్టెంబర్‌లో సంభవించిన వరదలు, భారీ వర్షాల కారణంగా 13 జిల్లాల్లో 36,726 మంది రైతులకు చెందిన 18,581.38 హెక్టార్లలో నష్టం నమోదైందని, రూ.31.24 కోట్ల ఇన్పుట్ సబ్సిడీ అవసరమని వెల్లడించారు.
















