హైదరాబాద్ : ప్రజలకు వారి గమ్యస్థానానికి చేరువయ్యే వరకు (లాస్ట్ మైల్ కనెక్టివిటీతో సహా) ప్రజా రవాణా సౌకర్యాలు అందుబాటులో ఉంటే వ్యక్తిగత వాహనాల వినియోగం గణనీయంగా తగ్గుతుందని పేర్కొన్నారు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ . మెట్రో, ఆర్టీసీ సిటీ బస్సుల మధ్య అనుబంధాన్ని మరింత మెరుగు పర్చాల్సిన అవసరం ఉందన్నారు. మెట్రో లేదా ఎంఎంటీఎస్ రైలు దిగిన వెంటనే ప్రజలు తమ గమ్య స్థానాలకు చేరుకునేలా ఆర్టీసీ బస్సులు , ఇతర ప్రజా రవాణా సేవలు అందుబాటులో ఉండాలని ఆయన అన్నారు. రహదారులకు ఇరువైపులా ఫుట్‌పాత్‌లు ఉంటే, ప్రజలు ప్రజా రవాణా వ్యవస్థ వద్దకు నడిచి వెళ్లడం సులభతరం అవుతుందని, తద్వారా చాలా వరకు ట్రాఫిక్ సమస్యలను అధిగమించ వచ్చని చెప్పారు కమిషనర్. సైబరాబాద్ ఐటీ కారిడార్‌లో ట్రాఫిక్ సమస్యకు శాశ్వత, ఆచరణాత్మక పరిష్కారాలను చూపే లక్ష్యంతో రాయదుర్గంలోని టి – హబ్ లో ‘సైబరాబాద్ మూవ్స్ – 2026 సదస్సులో కమిషనర్ పాల్గొని ప్రసంగించారు.
ఒక నిర్దిష్ట ప్రాంతంలో ప్రజా రవాణా సౌకర్యాలు, సైకిల్ ట్రాక్‌లు, ఫుట్‌పాత్‌లు, రహదారులపై వర్షపు నీరు నిల్వ ఉండకుండా తీసుకునే చర్యలను ఒక పైలట్ ప్రాజెక్టుగా అమలు చేసి చూపించాలన్నారు ఏవీ రంగనాథ్. అది ప్రజల్లో నమ్మకాన్ని కలిగించడమే కాకుండా చేపట్టే కార్యక్రమాలకు వారి పూర్తి మద్దతును కూడా పొందేలా చేస్తుందని పేర్కొన్నారు. దీనికి ఉదాహరణగా హైడ్రా చేపట్టిన చెరువులు, కాలువల పునరుద్ధరణను ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. చెరువుల చుట్టూ ఉన్న ఆక్రమణలను తొలగించినప్పుడు కొంత మంది నిరసన తెలిపినప్పటికీ, ఆ తర్వాత అక్కడ వచ్చిన మెరుగుదలలను చూసి అందరూ సహకరించడం మొదలు పెట్టారని గుర్తు చేశారు. ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించే విషయంలోనూ ఇదే విధానాన్ని అనుసరిస్తే మంచి ఫలితాలు వస్తాయని ఆయన చెప్పారు. అంతే కాకుండా నగర ప్రణాళికలను కూడా సమీక్షించాల్సిన అవసరం ఉందన్నారు.
. గతంలో భవనాలు ఒకటి లేదా రెండు అంతస్తుల ఎత్తులో ఉన్నప్పుడు, కాలనీలు లేదా లేఅవుట్లలో 10 శాతం భూమిని ప్రజా అవసరాల కోసం కేటాయించే వారని, అయితే ఇప్పుడు బహుళ అంతస్తుల భవనాలు పెరిగిన నేపథ్యంలో ఆ కేటాయింపులు సరిపోవని చెప్పారు. మార్కెట్ల కోసం ప్రత్యేక స్థలాలను కేటాయిస్తే, చిన్న వ్యాపారాలు రహదారులపై లేదా ఫుట్‌పాత్‌లపై నిర్వహించాల్సిన అవసరం ఉండదని ఆయన అన్నారు. కనీసం కొన్ని ప్రాంతాల నైనా ఎంపిక చేసి, వాటిలో అవసరమైన అన్ని సౌకర్యాలను కల్పించి, ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలని కోరారు.

















