విశాఖపట్నం జిల్లా : ఏపీ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మాజీ సీఎం జగన్ రెడ్డిని ఏకి పారేశారు. ఆయన రిషికొండ ప్యాలెస్ ను సహచర మంత్రులతో కలిసి పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వం 58 గదులున్న హరిత రిసార్ట్స్‌ను కూల్చివేసే నాటికి దాని ద్వారా ఏపీటీడీసీ కి ఏడాదికి రూ.7.5 కోట్ల ఆదాయం వచ్చేదన్నారు. దానిని పడగొట్టడం వల్ల డిపార్ట్‌మెంట్ తీవ్రంగా నష్ట పోయిందని ఆరోపించారు. చివరకు బ్యాంక్ లోన్‌లకు వెళ్లి నిర్వహణకు డబ్బులు తెచ్చుకునే పరిస్థితి తెచ్చారని మండిపడ్డారు. జీవోలో ‘రీడెవలప్‌మెంట్’ అని పేర్కొని, నిబంధనలు అతిక్రమించి రాజప్రాసాదాన్ని నిర్మించుకున్నారని ఆరోపించారు.. దీనిని కూల్చివేయడం సరికాదు, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ విధానంలో సమర్థవంతంగా నిర్వహించగల సంస్థకు బాధ్యతలు అప్పగిస్తాం అని ప్రకటించారు. నియంత్రణ మాత్రం ప్రభుత్వానిదే ఉంటుందన్నారు.
దీని ద్వారా హరిత రిసార్ట్ పూర్వ వైభవాన్ని నిలబెట్టడంతో పాటు, ప్రాపర్టీని ప్రొటెక్ట్ చేస్తాం అన్నారు కందుల దుర్గేష్. ప్రభుత్వానికి ఆదాయం వచ్చేలా చూస్తాం. పూర్తి సమాచారంతో ఈ నివేదికను సీఎం చంద్రబాబు నాయుడుకు సమర్పిస్తాం.” అని వెల్లడించారు. సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలాశ్రీ బాలవీరాంజనేయ స్వామి మాట్లాడుతూ గత ప్రభుత్వం పర్యాటక శాఖ భూములను నాశనం చేసిందని ఆరోపించారు. శంకుస్థాపన రాయి మీద సరీ డెవలప్‌మెంట్ రిసార్ట్’ అని రాసి, లోపల ప్యాలెస్ కట్టి ప్రజలను వంచించారని మండిపడ్డారు. ఇడుపులపాయ, బెంగళూరు, తాడేపల్లి, లోటస్ పాండ్ ల మాదిరి కాకుండా ప్రభుత్వ ధనంతో ప్యాలెస్ కట్టుకోవాలని ఉందని ధైర్యంగా చెప్పుకోలేక దొంగచాటుగా కట్టారు. ఇద్దరు పేదలకు ఇచ్చే ఇళ్ల సైజులో బాత్‌రూమ్, 11 ఇళ్లు కట్టే స్థలంలో బాత్‌టబ్ పెట్టారు. గత ప్రభుత్వానిది విధ్వంసక పాలన. వారు ‘ప్రజావేదిక’ను కూల్చినట్లు మేము దీనిని కూల్చివేయబోమన్నారు. ప్రజాధనాన్ని వారు దుర్వినియోగం చేస్తే, మేము సద్వినియోగం చేస్తాం. సామాన్య ప్రజలకు, ప్రకృతి ప్రేమికులకు రుషికొండ ప్యాలెస్ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటాం అని అన్నారు.


















