ఆధారాలు లేకుండా ఆరోప‌ణ‌లు చేయ‌డంలో జ‌గ‌న్ దిట్ట

నిప్పులు చెరిగిన వ్య‌వ‌సాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు

hellotelugu-Atchannaidu

అమ‌రావ‌తి : ఏపీ రాష్ట్ర వ్య‌వ‌సాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు నిప్పులు చెరిగారు. ఆయ‌న మాజీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని ఏకి పారేశారు. ఇవాళ ఆయ‌న మీడియాతో మాట్లాడారు. ఆధారాలు లేకుండా ఆరోప‌ణ‌లు చేయ‌డంలో జ‌గ‌న్ రెడ్డి సిద్ద‌హ‌స్తుడ‌ని ఎద్దేవా చేశారు. కొబ్బరి ధరలపై తప్పుడు కథనాలు ప్ర‌చురించ‌డం ఎంత వ‌ర‌కు స‌బ‌బు అని ప్ర‌శ్నించారు. గత రెండేళ్లుగా కొబ్బరి రైతులకు మంచి ధరలు లభిస్తున్నాయని చెప్పారు. ఆ విష‌యం తెలుసుకోకుండా మాట్లాడటం మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు. 2024-25లో బంతి కొబ్బరి వెయ్యి కాయలకు రూ.15 వేల నుంచి రూ.18 వేల వరకు, కోప్రా రూ.15,500 నుంచి రూ.19,500 వరకు ధర లభించిందన్నారు. 2025-26లో బంతి కొబ్బరి రూ.18 వేల నుంచి రూ.27 వేల వరకు, కోప్రా రూ.17 వేల నుంచి రూ.28,500 వరకు విక్రయమై రైతులకు మంచి ఆదాయం వచ్చిందన్నారు. ఈ ఏడాది ప్రారంభంలో కొన్ని మార్కెట్ పరిస్థితుల వల్ల స్వల్ప ఒడిదుడుకులు ఎదురైనా, ప్రస్తుతం మార్కెట్ మళ్లీ పుంజుకుని బంతి కొబ్బరి వెయ్యి కాయలకు రూ.14 వేల నుంచి రూ.18 వేల వరకు, కోప్రా రూ.15 వేల నుంచి రూ.24 వేల వరకు ధరలు లభిస్తున్నాయని తెలిపారు.

ఇలాంటి సమయంలో నీ సొంత పత్రికలో “కొబ్బరి ధరలు లేవు” అంటూ తప్పుడు కథనాలు ప్రచారం చేయడం వెనుక అసలు ఉద్దేశం ఏమిటి జగన్? అని నిల‌దీశారు అచ్చెన్నాయుడు. మార్కెట్‌పై ప్రతికూల ప్రభావం చూపించి కొబ్బరి ధరలు పడిపోయేలా చేయడమే నీ కుట్రనా? ప్రస్తుతం రైతులకు వస్తున్న మంచి ధరలను దెబ్బతీసి, వ్యాపారులు తక్కువ ధరలకు కొబ్బరి కొనుగోలు చేసేలా చేయడానికే ఈ తప్పుడు ప్రచారమా? అని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. రైతుల్లో భయాందోళనలు సృష్టించి, మార్కెట్‌లో గందరగోళం నెలకొల్పి రైతుల పొట్ట కొట్టడమే నీ లక్ష్యమా? రాష్ట్రంలో రైతులకు మేలు జరుగుతుంటే అది చూడలేక, నీ రాజకీయ ప్రయోజనాల కోసం రైతుల జీవితాలతో కూడా చెలగాట మాడుతున్నావా? అని మండిప‌డ్డారు.

Exit mobile version