ప్రజల దృష్టి మళ్లించేందుకే జగన్ రాష్ట్రపతి పాలన డిమాండ్

క్షేత్రస్థాయిలో గొడవలు సృష్టిస్తూ ప్రభుత్వంపై నిందలా?

hellotelugu-PaallaSrinivasRao

అమరావతి : రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలంటూ వైఎస్సార్‌సీపీ చేస్తున్న డిమాండ్‌ రాజకీయ దృష్టి మళ్లింపు ఎత్తుగడ అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అన్నారు. క్షేత్రస్థాయిలో గొడవలు సృష్టిస్తూ, మరోవైపు రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని ప్రచారం చేయడం వైసీపీ ద్వంద్వ వైఖరికి నిదర్శనమని పేర్కొన్నారు. రాష్ట్రపతి పాలన పేరుతో ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలను ప్రజలు గమనించాలని అన్నారు. ఇవాళ ప‌ల్లా శ్రీ‌నివాస రావు మీడియాతో మాట్లాడారు. జగన్‌రెడ్డి తో పాటు వైసీపీ ముఠాపై ఉన్న క్రిమినల్‌ కేసుల అంశాన్ని ప్రస్తావించారు. అక్రమాస్తుల కేసులో జగన్‌రెడ్డి 16 నెలల పాటు జ్యుడీషియల్‌ కస్టడీలో ఉన్న విషయాన్ని మ‌రిచి పోతే ఎలా అని ప్ర‌శ్నించారు .. గతంలో సీబీఐ ఎంపీ అవినాశ్‌రెడ్డిని అరెస్టు చేసేందుకు వచ్చిన సందర్భంలో గొడ్డలిపార్టీ వ్యవహరించిన తీరును ప్రజలు ఇంకా మరిచి పోలేదన్నారు. వారిపై ఉన్న ఆరోపణలకు సమాధానం చెప్పకుండా రాష్ట్రపతి పాలన డిమాండ్‌తో ప్రజల దృష్టిని మళ్లించాలని చూడటం రాజకీయ కపటత్వమని విమర్శించారు.

గత ఎన్నికల సమయంలో గొడ్డలి పార్టీ వ్యవహరించిన తీరును ప్రజలు గుర్తుంచుకున్నారని పల్లా శ్రీ‌నివాస రావు అన్నారు. ప్రస్తుతం కూడా క్షేత్రస్థాయిలో వివాదాలు సృష్టిస్తూ, మరోవైపు మీడియా ముందుకు వచ్చి రాష్ట్రపతి పాలన కోరడం విడ్డూరంగా ఉందన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం ఉద్రిక్తతలను పెంచి, ఆ నెపాన్ని ప్రభుత్వంపై నెట్టే ప్రయత్నాలను సహించబోమని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే ముందు గత పాలనలో తమ వ్యవహారశైలిపై వైసీపీ ఆత్మపరిశీలన చేసుకోవాలని హితవు పలికారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్య బద్ధంగా, స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్డీయే కూటమి ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకుంటోందని పల్లా శ్రీనివాసరావు తెలిపారు.

ప్రతి అభ్యర్థి ఎలాంటి ఆటంకాలు లేకుండా నామినేషన్‌ దాఖలు చేయడంతో పాటు, ప్రతి ఓటరు భయం లేకుండా తన ఓటు హక్కును వినియోగించుకునేలా పరిస్థితులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఎన్నికల ప్రక్రియకు ఆటంకాలు కలిగించే వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు వైసీపీ రెచ్చగొట్టే ప్రకటనలకు ప్రజలు ప్రభావితం కాకుండా వాస్తవాలను గమనించాలని ఆయన కోరారు. రాష్ట్రపతి పాలన పేరుతో రాజకీయ గందరగోళం సృష్టించడం మానుకోవాలని సూచించారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తూ స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత ఎన్నికలు నిర్వహించడమే కూటమి ప్రభుత్వ సంకల్పమని పల్లా శ్రీనివాసరావు పేర్కొన్నారు.

Exit mobile version