తిరుపతి : రాష్ట్రంలో ఏపీ కూటమి రాచరిక పాలన సాగిస్తోందని సంచలన వ్యాఖ్యలు చేశారు తిరుపతి ఎంపీ మద్దెల గురుమూర్తి. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులు నామినేషన్లు వేయకుండా అడ్డుకోవడం దారుణమన్నారు. ఇది మంచి పద్దతి కాదన్నారు ఎంపీ. తిరుపతి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మేయర్ అభ్యర్థి వాసు యాదవ్ గత రెండు రోజులుగా నామినేషన్ దాఖలు చేసేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ, కూటమి ప్రభుత్వ అరాచకాలు, పోలీసుల నిర్లక్ష్యం కారణంగా నామినేషన్ వేయలేక పోవడం అత్యంత శోచనీయం అని పేర్కొన్నారు మద్దెల గురుమూర్తి. ప్రజాస్వామ్యంలో ఎన్నికల్లో పోటీ చేయడం ప్రతి పౌరుడికి ఉన్న ప్రాథమిక హక్కు అని స్పస్టం చేశారు. ఆ హక్కును అడ్డుకోవడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం అన్నారు ఎంపీ.
తనకు నామినేషన్ దాఖలు చేసే అవకాశం కల్పించక పోవడాన్ని నిరసిస్తూ వాసు యాదవ్ తన తల్లితో కలిసి తిరుపతి కార్పొరేషన్ కార్యాలయం ఎదుట శాంతియుతంగా నిరసన వ్యక్తం చేయడం బాధాకరం అన్నారు. ఈ విషయంపై ఎన్నికల సంఘం, జిల్లా కలెక్టర్, ఎస్పీకి పలుమార్లు లిఖిత పూర్వకంగా ఫిర్యాదులు చేసినప్పటికీ స్పందన లేకపోవడం అధికార యంత్రాంగం పనితీరుకు నిదర్శనం అన్నారు ఎంపీ. సాక్షాత్తూ పోలీసుల సమక్షంలోనే వాసు యాదవ్ తరపున నామినేషన్ వేసేందుకు వెళుతున్న పార్లమెంటు సభ్యుని నుండే నామినేషన్ పత్రాలను బలవంతంగా లాక్కోవడం ఎన్నికల నిర్వహణ తీరుపై తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అభ్యర్థులకు రక్షణ కల్పించి, స్వేచ్ఛగా నామినేషన్లు దాఖలు చేసుకునే వాతావరణాన్ని సృష్టించాల్సిన బాధ్యత అధికార యంత్రాంగంపై ఉందన్నారు. కానీ, అడ్డంకులను తొలగించాల్సిన పోలీసుల సమక్షంలోనే ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడం ప్రజాస్వామ్యానికి మచ్చ అని వాపోయారు.
రాష్ట్ర ఎన్నికల సంఘం ఇప్పటికైనా తక్షణమే స్పందించి, వాసు యాదవ్ నామినేషన్ దాఖలు చేసేందుకు అవసరమైన భద్రత కల్పించాలి. ఆయనకు రాజ్యాంగబద్ధంగా లభించిన హక్కులను కాపాడటంతో పాటు, నామినేషన్ ప్రక్రియకు ఆటంకాలు కలిగించిన ఘటనలపై నిష్పక్షపాతంగా విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలి. ఎన్నికలు భయం, బెదిరింపులు, దౌర్జన్యాలకు తావులేకుండా స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా జరిగేలా ఎన్నికల సంఘం తక్షణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నాను.
