అమరావతి : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేరుగా రంగంలోకి దిగారు. ఆయన మంగళవారం రాజమండ్రిలోని ఆంధ్ర పేపర్ మిల్స్ కాలుష్యాన్ని ప్రత్యక్షంగా పరిశీలించారు. ఉదయాన్నే వెంకట నగరం ప్రాంతం నుంచి గోదావరి మధ్యన ఉన్న లాగూన్స్ (మడుగులు) తనిఖీ చేశారు .పేపర్ మిల్స్ యాజమాన్యం తూర్పులంకలోని ప్రత్యేక మడుగుల్లో కాలుష్య కారక నీటిని విడిచిపెడుతుండడాన్ని పరిశీలించారు. ఏ మేరకు శుద్ధి చేసి అక్కడ విడిచి పెడతారంటూ ప్రశ్నించారు. . ఆ ప్రాంత జలాల్లో ఉన్న కాలుష్యం ఎంత అన్న విషయాలను ప్రత్యక్షంగా వెళ్లి తెలుసుకున్నారు పవన్ కళ్యాణ్. మట్టి, నీటి నమూనాలను సేకరించి అక్కడే మొబైల్ కిట్స్ ద్వారా పరీక్షలు జరిపించారు. కాలుష్య కారకాలు ఉన్నట్లు గుర్తించారు. నిబంధనలను పాటించనందున వెంటనే పరిశ్రమకు నోటీసులు జారీ చేయాలని ఆదేశాలు జారీ చేశారు.
మడుగుల్లో గుర్రపు డెక్క పేరుకుపోయిన తీరుపై పీసీబీ అధికారులను ప్రశ్నించారు . పరిశ్రమలకు రాయితీలపై భూములు ఇచ్చి ప్రోత్సహిస్తుంటే కనీసం పర్యావరణ స్పృహ కూడా లేకపోతే ఎలా అంటూ ప్రశ్నించారు డిప్యూటీ సీఎం. ఇంత కాలుష్యం విడుదల చేస్తున్న ఆంధ్ర పేపర్ మిల్స్ కు ఎందుకు నోటీసులు ఇవ్వలేదని కాలుష్య నియంత్రణ మండలి ఉన్నతాధికారులపై సీరియస్ అయ్యారు. ప్రభుత్వానికి ఆ పరిశ్రమ చెల్లించాల్సిన రూ. 13 కోట్ల బకాయిలు ఎందుకు వసూలు చేయలేక పోతున్నారని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరిని ప్రశ్నించారు. అధికారులు బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించక పోతే ప్రజలకు మేం సమాధానం చెప్పుకోవాలంటూ అధికారులపై అసహనం వ్యక్తం చేశారు. ఇలాంటి నీటినీ నదిలోకి వదిలి అక్కడ మన పిల్లల్ని స్నానం చేయించే సాహసం చేయగలమా అని అన్నారు.

















