హైదరాబాద్ : రాష్ట్రంలోని వ్యవసాయ మార్కెటింగ్ శాఖను లక్ష్యం సాంకేతిక పరిజ్ఞానంతో మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా తీర్చిదిద్దేందుకు వేగంగా చర్యలు చేపట్టాలని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. మార్కెటింగ్ శాఖపై సమీక్ష చేపట్టారు. శాఖ పనితీరు, అభివృద్ధి పనులు, డిజిటలీకరణ, పత్తి కొనుగోళ్ల సన్నద్ధత, ఇంజినీరింగ్ పనులు, మార్కెట్ యార్డులలో సౌర విద్యుత్ వ్యవస్థల ఏర్పాటు, ప్రత్యేక బృందాల తనిఖీలు తదితర అంశాలపై ఆరా తీశారు. రాష్ట్రంలోని 206 మార్కెట్ కమిటీలను పూర్తిస్థాయిలో ఆటోమేషన్ చేయాలని మంత్రి ఆదేశించారు. ఇందుకు సంబంధించిన ప్రణాళికలు, టెండర్ ప్రక్రియలను ఆగస్టు నెలాఖరులోగా పూర్తి చేసి, సెప్టెంబర్ నుంచి అమలు ప్రారంభించాలని సూచించారు.
ప్రతి మార్కెట్ కమిటీలో సీసీ కెమెరాలు, ఎలక్ట్రానిక్ వెయింగ్ స్కేల్స్, గేట్ ఎంట్రీ-ఎగ్జిట్ వ్యవస్థలను ఒకే డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌పై అనుసంధానం చేయాలని ఆదేశించారు. రవాణా శాఖలో అమలవుతున్న నంబర్ ప్లేట్ స్కానింగ్ విధానాన్ని మార్కెట్ యార్డుల్లో కూడా అమలు చేసి, ప్రతి వాహనం ప్రవేశం, నిష్క్రమణ, తూకం, లావాదేవీలన్నీ డిజిటల్ రూపంలో నమోదయ్యేలా అవసరమైన సాఫ్ట్‌వేర్‌ను రూపొందించాలని ఐటీ విభాగానికి సూచించారు. ఇకపై మార్కెటింగ్ శాఖలో జరిగే అన్ని కొనుగోళ్లు పూర్తిగా డిజిటల్ విధానంలోనే నిర్వహించాలని స్పష్టం చేశారు. ఇటీవల ఏర్పాటు చేసిన ఏడు ప్రత్యేక తనిఖీ బృందాలు ఈ వారం నిర్వహించిన తనిఖీలపై వచ్చే సోమవారం లోగా నివేదికలు సమర్పించాలని ఆదేశించారు. ఆ నివేదికల ఆధారంగా మార్కెటింగ్ డైరెక్టర్, వ్యవసాయ శాఖ కార్యదర్శి తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ బృందాల పనితీరుకు వారంవారీ టైమ్‌బౌండ్ వ్యవస్థ అమలు చేయాలని స్పష్టం చేశారు.
రానున్న పత్తి కొనుగోలు సీజన్‌కు ముందుగానే సమగ్ర సన్నద్ధత అవసరమని పేర్కొన్న మంత్రి, కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా , జిన్నింగ్ మిల్లుల యాజమాన్యాలు, సంబంధిత అధికారులతో రెండో వారంలో సంయుక్త సమావేశం నిర్వహించాలని ఆదేశించారు. గత రెండు సంవత్సరాల్లో విజిలెన్స్ విభాగం గుర్తించిన లోపాలను దృష్టిలో ఉంచుకొని, గతంలో జరిగిన అక్రమాలకు ఎటువంటి అవకాశం లేకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. కనీస మద్దతు ధర ప్రయోజనం పూర్తిగా రైతులకే అందేలా చర్యలు చేపట్టాలని, అక్రమాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కొత్తగా కొనుగోలు చేసే ప్యాడీ క్లీనర్లు, డ్రయర్లు, లిఫ్టర్లు వంటి పరికరాలను కొనుగోలు చేసే ముందు సాంకేతిక పరీక్షలు నిర్వహించి, అధికారులకు అవసరమైన శిక్షణ ఇవ్వాలని ఆదేశించారు. ఆయా పరికరాలు నిజంగా అవసరమైన జిల్లాల్లో మాత్రమే కొనుగోలు చేయాలని, ఉపయోగం లేకుండా పరికరాలు కొనుగోలు చేసి మూలన పడేస్తే సంబంధిత కార్యదర్శి, జిల్లా మార్కెటింగ్ అధికారులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
















