విశాఖ డేటా సెంటర్‌లో ఉల్లంఘనలపై విచార‌ణ

ఆదేశించిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి

hellotelugu-APHighCourt

అమ‌రావ‌తి : విశాఖపట్నం డేటా సెంటర్ ప్రాజెక్టుపై ఈరోజు వాదనలు విన్న అనంతరం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లిసా గిల్, జస్టిస్ చల్లా గుణరంజన్‌లతో కూడిన ధర్మాసనం తదుపరి విచారణను వాయిదా వేసింది. విశాఖపట్నంలో అదానీ ఇన్‌ఫ్రా ప్రతిపాదించిన భారీ డేటా సెంటర్ ప్రాజెక్టుపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో వాదనలు జరిగాయి. ఈ ప్రాజెక్టు కోసం సింహాచలం దేవస్థానం భూములను లీజుకు ఇవ్వడాన్ని, అలాగే ప్రాజెక్టుకు మంజూరైన పర్యావరణ అనుమతులను సవాలు చేస్తూ పర్యావరణవేత్త బొలిశెట్టి సత్యనారాయణ దాఖలు చేసిన రిట్ పిటిషన్‌ను ధర్మాసనం విచారించింది.

పిటిషనర్ తరఫున వాదించిన న్యాయవాది విరాగ్ గుప్తా ప్రతిపాదిత ప్రాజెక్టు ప్రాంతం వన్యప్రాణి అభయారణ్యం/రిజర్వ్ ఫారెస్ట్‌కు కేవలం 470 నుంచి 750 మీటర్ల దూరంలోనే ఉందని కోర్టు దృష్టికి తీసుకు వచ్చారు. వర్తించే నిబంధనల ప్రకారం అభయారణ్యానికి ఒక కిలోమీటర్ పరిధిలో ప్రాజెక్టుల నిర్మాణం నిషేధించ బడిందని, ఐదు కిలోమీటర్ల పరిధిలోని ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వ స్థాయిలో తప్పనిసరిగా పర్యావరణ అనుమతి అవసరమని ఆయన వాదించారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం G.O. No. 4 ద్వారా ఈ నిబంధనలను సడలించి, సింగిల్ విండో విధానంలో అనుమతులు ఇచ్చిందని, ఇది చట్టానికి విరుద్ధమని ఆయన వాదించారు.

ఇది భారీ స్థాయి డేటా సెంటర్ ప్రాజెక్టు అయినప్పటికీ, దీనిని కేవలం సాధారణ “బిల్డింగ్ ప్రాజెక్టు”గా చూపించి అనుమతులు పొందారని పిటిషనర్ త‌ర‌పు లాయ‌ర్ ఆరోపించారు. ఈ ప్రాజెక్టు విశాఖపట్నం తాగునీటి రిజర్వాయర్లు, వాటి క్యాచ్‌మెంట్ ప్రాంతాలు, భూగర్భ జల వనరులపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే సరైన రిజిస్టర్డ్ లీజ్ డీడ్ లేకుండానే సబ్-లీజ్ ద్వారా భూమిని ఎలా అప్పగించారనే అంశాన్ని కూడా ఆయన ప్రశ్నించారు.

ప్రభుత్వం తరఫున హాజరైన అడ్వకేట్ జనరల్ మాట్లాడుతూ ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పర్యావరణ అనుమతులు 10 జూన్ 2026 నాటికే మంజూరయ్యాయని కోర్టుకు తెలిపారు. సంబంధిత అన్ని అంశాలను సమగ్రంగా పరిశీలించిన అనంతరం, 27 ఫిబ్రవరి న జారీ చేసిన G.O. No. 4 ద్వారా అవసరమైన సడలింపులు కల్పించామని ఆయన పేర్కొన్నారు. దే అంశంపై మరో వ్యక్తి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (NGT)లో కూడా పిటిషన్ దాఖలు చేశారని, ఆ కేసు ఎల్లుండి విచారణకు రానుందని ఆయన కోర్టుకు తెలిపారు. ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం, పిటిషనర్ దాఖలు చేసిన రీజాయిండర్, ప్రభుత్వ ఉత్తర్వులు (G.Os), ఇతర సంబంధిత రికార్డులను పరిశీలించాల్సి ఉందని ధర్మాసనం పేర్కొంది.

Exit mobile version