వారణాసి : రైట్ టైమ్.. రైట్ లీడర్ నరేంద్ర మోదీ. దేశాన్ని అభివృద్ధి వైపు నడిపిస్తున్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం కాదు.. దేశ ప్రయోజనాల కోసం ఆయనకు మనం అండగా నిలవాలని పిలుపునిచ్చారు చంద్రబాబు నాయుడు. వారణాసిలో నిర్వహించిన వారణాసి-వాద్నగర్ సేవా సంకల్ప్ అభియాన్ కార్యక్రమంలో చంద్రబాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మోదీ నాయకత్వంలో దేశం సాధిస్తున్న ప్రగతిని, సంక్షేమం నుంచి సాంకేతికత వరకు చోటు చేసుకున్న మార్పులను ఆయన ప్రస్తావించారు. ఏపీకి కేంద్రం అందిస్తున్న సాయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎన్నటికీ మరువలేమని ముఖ్యమంత్రి వెల్లడించారు. కాశీ క్షేత్రం ప్రధాని నరేంద్ర మోదీ కర్మ భూమి. కాశీ పుణ్యక్షేత్రం నుంచి నరేంద్ర మోదీ మూడుసార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఇక్కడి ప్రజలు వారణాసికి నేతను ఎన్నుకోవడమే కాదు… దేశానికి ఓ లీడర్‌ను అందించారు. ప్రధాని నరేంద్ర మోదీ భారత్‌ను అభివృద్ధి చెందిన దేశాల సరసన చేరుస్తున్నారు.
వీకేఎస్ అనేది అభివృద్ధి మంత్రం. ఈ మంత్రంతో దేశం అభివృద్ధి చెందుతోంది. వి అంటే వాద్నగర్, కె అంటే కాశీ, ఎస్ అంటే సెప్టెంబర్. ప్రజలకు సేవ చేస్తే.. దేశానికి సేవ చేయడమేనని ప్రధాని నరేంద్ర మోదీ నమ్ముతారు. 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారు. 80 కోట్ల మంది ప్రజలకు ఉచితంగా ఆహార ధాన్యాలు అందుతున్నాయి. జేజేఎం, అమృత్ వంటి పథకాల ద్వారా 4 కోట్ల ఇళ్లకు తాగునీటి సౌకర్యం కల్పించారు. తాగునీటి కోసం ఎవ్వరూ ఇబ్బంది పడకూడదనేది ప్రధాని కల. ఇవి కేవలం అంకెలు మాత్రమే కాదు… ఈ అంకెలు వెనుక పేద, మధ్య తరగతి కుటుంబాల అభివృద్ధి-సంక్షేమం ఉంది. పీఎం కిసాన్ కింద 11 కోట్ల మంది రైతులు లబ్ది పొందుతున్నారు. ఇందులో ఎలాంటి మధ్యవర్తులు లేరు. నేరుగా రైతుల ఖాతాలకే నగుదును జమ చేస్తున్నారంటూ ప్రశంసించారు చంద్రబాబు నాయుడు.
ప్రపంచంలోని వివిధ దేశాలు సంక్షోభంలో కూరుకుపోతున్న సందర్భంలో నరేంద్ర మోదీ దేశానికి మంచి నాయకత్వం అందించారు. 140 కోట్ల మంది భారతీయులను కాపాడారు. వారికి ఇబ్బందులు కలగకుండా చేశారు. 200 కోట్ల కోవిడ్ వ్యాక్సిన్ డోసులను ఉత్పత్తి చేసేలా ప్రొత్సహించిన మోదీ కరోనా బారి నుంచి ప్రజలను కాపాడారు. 101 దేశాలకు కోవిడ్ వ్యాక్సిన్లను ఉచితంగా సరఫరా చేసి మానవత్వాన్ని చాటుకున్నారు. విశ్వ మానవాళి సంక్షేమం కోసం డబ్బులు గురించి ఎలాంటి ఆలోచన చేయకుండా కోవిడ్ వ్యాక్సిన్లను ఉచితంగా వివిధ దేశాలకు అందించారు. ఆత్మనిర్భర్ భారత్, వోకల్ ఫర్ గ్లోబల్ ఇలాంటి విధానాలతో మేకిన్ ఇండియా కాన్సెప్ట్ బలోపేతం అయ్యేలా చేశారు. గతంలో డిఫెన్స్ పరికరాలను దిగుమతి చేసుకునేవాళ్లం.. కానీ ఇప్పుడు ఎగుమతి చేసే స్థాయికి చేరాం. టెక్నాలజీని పూర్తి స్థాయిలో అర్థం చేసుకున్న ఏకైక ప్రధాని నరేంద్ర మోదీ మాత్రమే.
స్పేస్, డ్రోన్, క్వాంటం, సెమీ కండెక్టర్ టెక్నాలజీస్ వంటి వాటితో పాటు… రోబోటిక్స్ వంటి వాటిని ప్రధాని మోదీ అర్థం చేసుకోగలరు.. వాటి వల్ల యువతకు లబ్ది చేకూర్చగలరు. గతంలో యువత ఉద్యోగాల మీద ఆధారపడే వాళ్లు. కానీ ప్రధాని దూరదృష్టితో 2.20 లక్షల స్టార్టప్ ల ద్వారా యువతే ఉద్యోగాలు కల్పించే స్థాయికి చేరుకున్నారు. ఉద్యోగాలు చేసే స్థాయి నుంచి ఉద్యోగాలు కల్పించే స్థాయికి యువత చేరారంటే దానికి ప్రధాని నరేంద్ర మోదీనే కారణం. అద్భుతమైన స్టార్టప్ ఎకో సిస్టం కలిగిన దేశాల్లో భారత్ మూడో స్థానంలో ఉంది. మహిళా సంక్షేమం, సాధికారత కోసం ప్రధాని చేస్తున్న కృషి అపూర్వం.. భేటీ బచావో-భేటీ పడావో, లక్పతీ దీదీ వంటి పథకాలే దీనికి నిదర్శనం. ఉజ్వల పథకం క్లీన్ ఫ్యూయల్ అందిస్తుంది.. ముద్ర పథకం పెట్టుబడి సమకూరుస్తుంది.. స్వయం సహయక సంఘాలు నమ్మకాన్ని పెంచుతున్నాయి. నారీ శక్తి అధినియం ద్వారా చట్టసభల్లో 33 శాతం మహిళా రిజర్వేషన్లు ఇవ్వబోతున్నారు.. ఇది గేమ్ ఛేంజర్ కాబోతోంది అని సీఎం చంద్రబాబు చెప్పారు.
