హైద‌రాబాద్ లో ‘ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్’ కోర్సులు

ముందుకు వ‌చ్చిన హార్వ‌ర్డ్ యూనివ‌ర్శిటీ

hellotelugu-RevanthReddy

హైద‌రాబాద్ : సీఎం ఎ. రేవంత్ రెడ్డి కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. ప్రపంచ ప్రఖ్యాత ‘హార్వర్డ్ యూనివర్సిటీ’ డిసెంబర్ నుండి హైదరాబాద్‌లో ఆసక్తి గలవారికి ‘ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్’ కోర్సులను అందించనుందని వెల్ల‌డించారు. యూకే బిజినెస్ స్కూల్స్ ప్రతినిధి బృందంతో జరిగిన సమావేశంలో తెలంగాణను ‘గ్లోబల్ నాలెడ్జ్ హబ్’గా మార్చేందుకు ప్రభుత్వం వేగవంతమైన చర్యలు తీసుకుంటోందని పేర్కొన్నారు. ఎంఎస్ఆర్ హెచ్ ఆర్ డీలో జరిగిన సమావేశంలో యూకే హౌస్ ఆఫ్ లార్డ్స్ సభ్యుడు కరణ్ బిలిమోరియా, బ్రిటిష్ కౌన్సిల్ డైరెక్టర్ జనక పుష్పనాథన్, చార్టర్డ్ అసోసియేషన్ ఆఫ్ బిజినెస్ స్కూల్స్ సీఈఓ ఫ్లోరా హామిల్టన్, బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్, వివిధ యూకే విశ్వ విద్యాలయాల నుండి 30 మంది ప్రతినిధులు ముఖ్యమంత్రిని కలిశారు.

ఈ సందర్భంగా వివిధ యూకే బిజినెస్ స్కూల్స్ డీన్‌లు , ఉన్నతాధికారులతో చర్చించారు. విశ్వ విద్యాలయాల అవసరాలకు అనుగుణంగా పూర్తి సహకారం అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం స్ప‌ష్టం చేశారు. ఎంఐటీ . పర్డ్యూ వంటి అనేక ఐవీ లీగ్ విశ్వ విద్యాలయాల కోసం హైదరాబాద్‌లో ‘ఆఫ్-షోర్ క్యాంపస్‌ల’ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమైందని వెల్లడించారు. విదేశీ విద్యాసంస్థల రాకతో అవి స్థానిక విశ్వవిద్యాలయాలు, పరిశ్రమలతో కలిసి ఇక్కడే పరిశోధనలకు దోహద పడతాయని ఆయన అన్నారు. తెలంగాణలో యూకే బిజినెస్ స్కూల్స్ ఏర్పాటైతే ప్రపంచ స్థాయి కార్పొరేట్ వ్యాపార సంస్థలు రాష్ట్రం వైపు దృష్టి సారిస్తాయని ఆయన పేర్కొన్నారు.

అదే సమయంలో, రాష్ట్రంలోని విద్యార్థులు , ఉపాధ్యాయులకు అంతర్జాతీయ సంస్థలు, ప్రపంచ స్థాయి అనుభవం , అవకాశాలు అందుబాటులోకి వస్తాయని ఆయన తెలిపారు. ఈ దిశగా హార్వర్డ్, ఎంఐటీ, యూనివర్సిటీ ఆఫ్ లండన్, వర్జీనియా టెక్, నార్త్ ఈస్టర్న్ యూనివర్సిటీ వంటి ప్రఖ్యాత అంతర్జాతీయ విశ్వ విద్యాలయాలతో ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్‌లు, డ్యూయల్ డిగ్రీ కోర్సులు, ఉపాధ్యాయ శిక్షణ , పరిశోధన వంటి రంగాలలో భాగస్వామ్యాలను ప్రారంభించవచ్చని తెలిపారు. విద్యార్థులకు ఇంగ్లీష్, జర్మన్ , జపనీస్ వంటి విదేశీ భాషా నైపుణ్యాలను మెరుగు పరిచేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని కూడా ఆయన పేర్కొన్నారు.

మారుతున్న మార్కెట్ అవసరాలకు అనుగుణంగా యువతకు అత్యాధునిక నైపుణ్య శిక్షణను అందించడానికి ‘యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ’ని ‘భారత్ ఫ్యూచర్ సిటీ’లో ఏర్పాటు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి వివరించారు. అత్యంత ప్రతిష్టాత్మకమైన ‘భారత్ ఫ్యూచర్ సిటీ’ని దేశంలోనే మొట్ట మొదటి ‘నెట్-జీరో గ్రీన్‌ఫీల్డ్ స్మార్ట్ సిటీ’గా సుమారు 30,000 ఎకరాల్లో అభివృద్ధి చేస్తున్నట్లు ఆయన తెలిపారు. అక్కడ ఒక విద్యా కేంద్రం ఏర్పాటుతో భవిష్యత్ తరాలకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ఆయన అన్నారు.

Exit mobile version