ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను అమ‌లు చేయాలి

కాంగ్రెస్ స‌ర్కార్ ను డిమాండ్ చేసిన వి. శ్రీ‌నివాస్ గౌడ్

hellotelugu-VSrinivasGooud

హైద‌రాబాద్ : మాజీ మంత్రి , జేఏసీ మాజీ కో చైర్మ‌న్ వి. శ్రీ‌నివాస్ గౌడ్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో మ్యానిఫెస్టోలో ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం హైదరాబాద్ లోని అల్వాల్‌లో తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రిలే నిరహార దీక్షలను ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు.

ఈ సందర్భంగా మాజీ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ వాదమే లేదన్న పరిస్థితుల్లో అల్వాల్ జేఏసీ ఆధ్వర్యంలో మొట్ట మొదట టెంట్ వేసి తెలంగాణ వాదం ఉందని చాటి చెప్పామ‌న్నారు. ఈ ఘ‌న‌త ఆల్వాల్ జేఏసీకి ద‌క్కుతుంద‌న్నారు. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో ప్రతి ఉద్యమకారుడికి 250 గజాల స్థలం, పెన్షన్, గుర్తింపు కార్డులు, అమరులైన ఉద్యమకారుల కుటుంబాలకు ప్రత్యేక నిధి ఏర్పాటు చేసి రూ.25,000 పెన్షన్ అందిస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఇప్పటికి 3 సంవత్సరాలు పూర్తి అయినప్ప‌టికీ అమ‌లు చేసిన పాపాన పోలేద‌న్నారు శ్రీ‌నివాస్ గౌడ్.

హామీల అమలుపై కేకే ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేశారని, కేశవ రావు కమిటీ ఇప్పటికే ఆరు నెలలుగా ఉద్యమకారులతో సమావేశాలు నిర్వహించి అభిప్రాయాలు సేకరించిందని అయినా అమ‌లు కాక పోవ‌డం విడ్డూరంగా ఉంద‌న్నారు. హామీలను అమలు చేయడానికి ఇంకా ఎంత సమయం పడుతుందో వారం రోజుల్లోగా ప్రభుత్వం స్పష్టంగా ప్రకటించాలని, లేనిపక్షంలో ఉద్యమకారులతో కలిసి చర్చించి తదుపరి కార్యాచరణను ప్రకటిస్తామని మాజీ మంత్రి హెచ్చ‌రించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి, మల్కాజిగిరి జేఏసీ నాయకులు సురేందర్ రెడ్డి, వెంకన్న, మాజీ కార్పోరేటర్ శాంత శ్రీనివాస్ రెడ్డి , తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version