సియోల్ (సౌత్ కొరియా) : ఎల్జీ కెమ్ గ్లోబల్ స్ట్రాటజీ సెంటర్ ప్రెసిడెంట్ , ఎల్జీ ఓవర్సీస్ హోల్డింగ్ కంపెనీస్ హెడ్ యున్-జు కోహ్ తో రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ సియోల్ లో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడారు. కాకినాడ పోర్టు సమీపంలో పాలీస్టైరిన్ తయారీ కేంద్రం/సముదాయాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. దక్షిణ కొరియాలోని ఎల్జీ కెమ్ అధునాతన కార్యకలాపాలను నమూనాగా తీసుకుని, మూలపేటలో ప్రపంచ స్థాయి నాఫ్తా క్రాకర్ కేంద్రాన్ని ఏర్పాటు చేసే అవకాశాన్ని పరిశీలించాలని కోరారు.
భారతదేశంలో సమగ్రమైన ఈవీ, బ్యాటరీ పవర్ స్టోరేజి పర్యావరణ వ్యవస్థను సృష్టించేందుకు, సమీకృత క్యాథోడ్ యాక్టివ్ మెటీరియల్, సెల్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసే అవకాశాన్ని పరిశీలించాలన్నారు. మూలపేటలో ఎస్ఏఎఫ్ (SAF), బయో-ఇథనాల్ ఉత్పత్తిపై దృష్టి సారించి, జీవ ఇంధనాల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని సూచించారు. ప్లాస్టిక్ వ్యర్థాలను వాల్యూ యాడెడ్ వనరులుగా మార్చేందుకు, ప్లాస్టిక్ రీసైక్లింగ్, పైరోలిసిస్ ప్లాంట్లను ప్రారంభించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో భాగస్వామ్యం వహించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.
ఎల్జీ కెమ్ గ్లోబల్ స్ట్రాటజీ సెంటర్ ప్రెసిడెంట్ యున్-జు కోహ్ మాట్లాడుతూ ఎల్జీ పాలిమర్స్ విశాఖపట్నం ప్లాంట్ (గోపాలపట్నం) ద్వారా గతంలో ఎల్జీ ఎలక్ట్రానిక్స్ భారతీయ కార్యకలాపాలకు, ఇతర తయారీదారులకు (పాలీస్టైరీన్) కీలకమైన పాలిమర్ భాగాలను సరఫరా చేశామని గుర్తుచేశారు. ప్రస్తుతం శ్రీసిటీలో, యాక్రిలోనిట్రైల్ బ్యూటాడైన్ స్టైరీన్ (ABS) కాంపౌండ్ ప్లాంట్‌ను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందించిన తాజా ప్రతిపాదనలపై సంస్థ ఉన్నతస్థాయి బృందంతో చర్చించి తగిన నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు.

















