అమరావతి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు. అమరావతి, తిరుపతి, విశాఖలో అంతర్జాతీయ క్రీడా పోటీలు నిర్వహించేందుకు ప్రణాళికలు రూపోందించాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. ప్రైవేట్ భాగస్వామ్యంతో మూడు ప్రాంతాల్లోనూ స్పోర్ట్స్ సిటీల అభివృద్ధి జరగాలన్నారు. ఏపీకి ఉన్న సుదీర్ఘ తీరప్రాంతంలో సూర్య లంక సహా వివిధ ప్రాంతాల్లోని బీచ్ ఫ్రంట్ లను అభివృద్ధి చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేయాలని సూచించారు. సూర్య లంక బీచ్ అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ తయారు చేయాలని సీఎం నిర్దేశించారు. తీరప్రాంత పర్యాటకం, గ్లోబల్ బిజినెస్-ఇన్నోవేషన్ ఎకో సిస్టమ్, గ్లోబల్ టాలెంట్-ఎలైట్ లివింగ్ అనే 3 పిల్లర్లపై ‘వైజాగ్ బే సిటీ’ అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. విశాఖ ఎకనామిక్ రీజియన్‌లోని 51.88 చదరపు కి.మీ. విస్తీర్ణంలో ‘వైజాగ్ బే సిటీ’ అభివృద్ధికి పెట్టుబడులు పెట్టేలా ప్రముఖ సంస్థల్ని ఆహ్వానించాలన్నారు.
బే సిటీలో 3,291 ఎకరాల ప్రభుత్వ భూమి లభ్యత ఉందని గుర్తించినట్టు ఈ సందర్భంగా అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. అలాగే విశాఖ ఎకనామిక్ రీజియన్లో ఇప్పటికి మొత్తం 49 ప్రాజెక్టులు రాగా…వీటిలో 18 ప్రాజెక్టులు గ్రౌండ్ అయ్యాయని, మరో 12 త్వరలో గ్రౌండ్ కానున్నాయని వివరించారు. మరో 19 ప్రాజెక్టులు ప్రణాళిక దశలో ఉన్నాయని చెప్పారు. అయితే వీటితో పాటు వచ్చే 3 నెలల్లో లక్ష చదరపు అడుగుల్లో ఇంటర్నేషనల్ కన్వెన్సన్ సెంటర్, హోటళ్లు, ఐటీ ప్రాజెక్టులు వచ్చేలా చూడాలని సీఎం లక్ష్యాన్ని నిర్దేశించారు. అరకు-పాడేరు-విశాఖను పర్యాటక సర్కిల్‌గా రూపొందించి ప్రత్యేక ఆకర్షణ తీసుకు రావాలన్నారు నారా చంద్రబాబు నాయుడు. పోర్టులు, ఫిషింగ్ హార్బర్లతో విశాఖ ఎకనామిక్ రీజియన్ అభివృద్ధికి ఎంతో ఆస్కారం ఉందన్నారు. వెల్నెస్ సెంటర్లకు ప్రత్యేకంగా భూ కేటాయింపులు జరపాలన్నారు.


















