Indian Railways : భారతీయ రైల్వే ప్రయాణికుల లగేజీపై నియంత్రణ కోసం కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. విమానాశ్రయాల్లో లగేజీ బరువును తూకం వేసే విధానాన్ని అనుసరిస్తూ, రైల్వేలు (Indian Railways) కూడా తమ ప్రయాణికుల బ్యాగులను స్టేషన్ వద్ద తూకం వేయించాల్సిందిగా నిబంధనలు ప్రవేశపెడుతున్నాయి.
Indian Railways Shocking Passengers
రైల్వే మంత్రిత్వ శాఖలో (Indian Railways) సమాచార విభాగం డైరెక్టర్ దిలీప్ కుమార్ ప్రకారం, ప్రయాణికులు తీసుకొచ్చే లగేజీని ఎలక్ట్రానిక్ వెయింగ్ మెషీన్‌ల సహాయంతో స్టేషన్‌ల వద్ద కొలుస్తారు. బరువు నిర్దేశిత పరిమితిని మించినట్లయితే, ప్రయాణికుడికి జరిమానా విధిస్తారు. తొలిదశగా ఈ విధానం ప్రయాగ్‌రాజ్, మీర్జాపూర్, కాన్పూర్, అలీఘర్ వంటి ప్రధాన స్టేషన్లలో అమలు కానుంది. తరువాత దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన స్టేషన్లకు విస్తరిస్తారు.
ప్రస్తుతం ప్రయాణికుడి టికెట్ తరగతిని బట్టి లగేజీ పరిమితిని నిర్ణయించే నిబంధనలు ఇప్పటికే ఉన్నాయి. కానీ వాటిని కఠినంగా అమలు చేయాలని ఈ కొత్త చర్యల ద్వారా భావిస్తున్నారు. ఉదాహరణకు, ఫస్ట్ ఏసీ ప్రయాణికులకు 70 కిలోల ఉచిత లగేజీ పరిమితి ఉంటుంది. అదనంగా 15 కిలోల అలవెన్స్ ఇవ్వబడుతుంది. అవసరమైతే పార్శిల్ వ్యాన్‌లో 65 కిలోల వరకు అదనంగా బుక్ చేసుకోవచ్చు.
అలాగే, సెకండ్ ఏసీ ప్రయాణికులకు 50 కిలోల పరిమితి, థర్డ్ ఏసీ మరియు ఏసీ చైర్‌కార్ ప్రయాణికులకు 40 కిలోల వరకు ఉచిత లగేజీ అనుమతించబడుతుంది. స్లీపర్ క్లాస్‌లో 40 కిలోలు, జనరల్ క్లాస్‌లో 35 కిలోలు ఉచితంగా తీసుకెళ్లవచ్చు. అన్ని తరగతులకూ కొన్ని కిలోల అదనపు భత్యం ఉంటుంది. అయితే 50 కిలోలకుపైగా ఏ ప్రయాణికుడూ ఉచితంగా తీసుకెళ్లలేడు.
బరువు పరిమితితో పాటు, బ్యాగ్ పరిమాణంపైనా నియంత్రణ ఉంటుంది. సాధారణంగా బ్యాగ్ పరిమాణం 100 సెం.మీ x 60 సెం.మీ x 25 సెం.మీ మించకూడదు. థర్డ్ ఏసీ మరియు చైర్‌కార్ తరగతుల కోసం ఈ పరిమాణం మరింత తక్కువగా నిర్ణయించబడింది — 55 సెం.మీ x 45 సెం.మీ x 22.5 సెం.మీ. ఈ పరిమితిని మించిన బ్యాగులను బ్రేక్ వ్యాన్ ద్వారా ప్రత్యేకంగా బుక్ చేయాల్సి ఉంటుంది. కనీస ఛార్జీ రూ.30.
అదనపు లగేజీ తీసుకెళ్లాలనుకుంటే, దానిని ముందుగానే రైల్వే (Indian Railways) పార్శిల్ కార్యాలయంలో బుక్ చేసుకోవాలి. లేకపోతే, ప్రయాణ సమయంలో మరింత ఖర్చు పడే అవకాశం ఉంటుంది. ఉచిత పరిమితిని మించిన లగేజీపై సాధారణ ఛార్జీ కంటే 1.5 రెట్లు ఎక్కువగా వసూలు చేస్తారు. కనీసం రూ.30 చెల్లించాల్సి ఉంటుంది.
వాహనాలు, బైసికిళ్లు వంటి పెద్ద సామగ్రిని రైల్లో ఉచితంగా తీసుకెళ్లలేరు. వీటిని ప్రత్యేకంగా పార్శిల్ విభాగం ద్వారా ముందుగానే బుక్ చేసుకోవాలి. చివరి నిమిషంలో బుకింగ్ లేకుండా ప్రయాణానికి ప్రయత్నిస్తే ఇబ్బందులు ఎదురవుతాయి.
ఇవి అన్నీ ప్రయాణికుల భద్రత, సౌలభ్యం దృష్టిలో పెట్టుకొని తీసుకున్న చర్యలని రైల్వే శాఖ స్పష్టం చేసింది. పండుగలు, సెలవుల సమయంలో ప్రయాణికుల రద్దీ పెరగడం వల్ల, ఈ నియమాలు మరింత అవసరమవుతున్నాయని అధికారులు పేర్కొన్నారు.
Also Read : GST Strong Impact : త్వరలో భారీగా తగ్గనున్న కార్ల ధరలు
