Indian Exports : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన తాజా సుంకాలు భారత పరిశ్రమలను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. ప్రత్యేకించి ఎగుమతులపై ఆధారపడిన రంగాలు సంక్షోభంలోకి వెళ్లే ప్రమాదం కనిపిస్తోంది. గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్ (GTRI) విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం, ట్రంప్ (Trump) ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం భారత నుంచి అమెరికాకు వెళ్లే పలు ఉత్పత్తుల (Indian Exports) ఎగుమతులను 50% నుండి 70% వరకు తగ్గించే అవకాశముందని వెల్లడించింది.
Indian Exports – ఎగుమతులకు గట్టి ఎదురుదెబ్బ
రొయ్యలు, ఆర్గానిక్ రసాయనాలు, మెకానికల్ పరికరాలు, నిట్టెడ్ మరియు వోవెన్ దుస్తులు, వజ్రాలు, బంగారు ఆభరణాలు, ఫర్నీచర్ వంటి ఉత్పత్తుల ఎగుమతులు భారీగా తగ్గే అవకాశముందని నివేదికలో పేర్కొంది. స్టీల్, అల్యూమినియం, కాపర్, ఆటో విడి భాగాల ఎగుమతులు కూడా 30% నుంచి 50% వరకు తగ్గొచ్చని జీటీఆర్‌ఐ వ్యవస్థాపకుడు అజయ్ శ్రీవాత్సవ తెలిపారు.
వస్త్ర పరిశ్రమపై తీవ్ర ప్రభావం
వస్త్ర పరిశ్రమను ఈ సుంకాలు తీవ్రమైనంగా ప్రభావితం చేశాయి. అమెరికా మార్కెట్‌పై ఎక్కువగా ఆధారపడే ఎంఎస్‌ఎంఈ సంస్థలు సుంకాల పెంపుతో ఆర్థికంగా దెబ్బతింటున్నాయని, ఈ రంగానికి ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించాలని అపెరల్ ఎగుమతిదారుల మండలి (ఏపీఈసీ) చైర్మన్ సుధీర్ సెఖ్రీ అభ్యర్థించారు. అమెరికా భారత వస్త్ర ఎగుమతులలో సుమారు 33% వాటాను కలిగి ఉందని ఆయన గుర్తు చేశారు.
రత్నాభరణ పరిశ్రమలో కలకలం
బంగారు ఆభరణాలు, వజ్రాలు, వజ్రాభరణాల ఎగుమతులపై 50% సుంకాలు విధించడంతో దేశీయ రత్నాభరణ పరిశ్రమ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. ప్రభుత్వం విధానపరమైన మార్పులు తీసుకురావాలని, అమెరికాకు ప్రత్యామ్నాయ మార్కెట్లను అన్వేషించాల్సిన అవసరం ఉందని పరిశ్రమ వర్గాలు సూచిస్తున్నాయి.
ప్రత్యామ్నాయ మార్కెట్ల అవసరం
ట్రంప్ (Trump) విధించిన సుంకాల వల్ల ఆటో విడి భాగాల తయారీ రంగం కూడా కుదేలవుతుంది. దీనికి పరిష్కారంగా కొత్త మార్కెట్లను అన్వేషించాల్సిన అవసరం ఉందని ఆటోపార్ట్ మేనుఫాక్చరర్ల సంఘం (APMA) జాతీయ అధ్యక్షురాలు శ్రద్ధా సూరి మార్వా అభిప్రాయపడ్డారు.
ప్రభుత్వం తరఫున చర్యలు
ప్రస్తుత పరిస్థితుల్లో ఎగుమతి ఆధారిత పరిశ్రమలను ఆదుకునేందుకు ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీలు, రాయితీలపై ఆలోచిస్తున్నట్టు సమాచారం. ముఖ్యంగా వస్త్ర, తోలు ఉత్పత్తులు, రత్నాభరణాలు, ఆటో భాగాలు, రసాయన పరిశ్రమలు లక్ష్యంగా ఈ చర్యలు తీసుకోనున్నట్లు సమాచారం.
ఫార్మా రంగానికి ఊరట
ఇతర రంగాలకు సుంకాలు విధించిన ట్రంప్, భారత ఫార్మా ఉత్పత్తులను మాత్రం మినహాయించారు. అమెరికాలో ఔషధ ధరలు ఇప్పటికే అధికంగా ఉండటంతో, అక్కడ ప్రజల్లో ఉన్న అసంతృప్తిని దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఫార్మాగ్జిల్ చైర్మన్ నమిత్ జోషి వివరించారు. అమెరికాలో విక్రయించే జెనరిక్ ఔషధాలలో సుమారు 40% భారత్ నుంచే సరఫరా అవుతుందన్నది గమనించాల్సిన విషయం.
అయితే, ట్రంప్ ఈ మినహాయింపు తాత్కాలికమని స్పష్టంగా పేర్కొన్న నేపథ్యంలో, కొన్ని భారతీయ ఫార్మా కంపెనీలు అమెరికాలోనే ఉత్పత్తి కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్నట్టు సమాచారం.
Also Read : Today Gold Price : శ్రావణమాసం వేల పరుగులు తీస్తున్న పసిడి ధరలు
