ముంబై : టాటా సన్స్ గ్రూప్ చైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత ఆర్థిక వ్యవస్థ బలంగా ఉందన్నారు. దీర్ఘకాలిక వృద్ధికి ఇంధన భద్రత, ఉత్పాదక రంగ ఉద్యోగాలు కీలకంగా మారనున్నాయని పేర్కొన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రపంచ వ్యాప్తంగా మార్కెట్ లో ఒడిదుడుకులు ఉన్నప్పటికీ భారత్ వరకు మాత్రం ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. వికసిత్ భారత్ 2047 దార్శనికతను సాధించడానికి ఇంధన భద్రత, అధునాతన తయారీ, మానవ వనరులలో పెట్టుబడులు, నాణ్యత ఆధారిత ఆవిష్కరణలు కీలకమని ఆయన నొక్కి చెప్పారు. అనిశ్చిత, కష్టతరమైన ప్రపంచంలో భారత ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా ఉందని, దేశం స్థిరమైన, బలమైన స్థితిలో ఉందని పలు సూచికలు చూపిస్తున్నాయని టాటా సన్స్ ఛైర్మన్ అన్నారు.
ఈ దార్శనికతను నెరవేర్చడానికి ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు, సంస్థలు , మేధో సంపత్తిపై ఆధారపడిన సమ్మిళిత, సుస్థిర అభివృద్ధి అవసరమని ఆయన అన్నారు. నాణ్యతపై దృష్టి సారించడం అత్యంత ముఖ్యమని పేర్కొన్నారు చంద్రశేఖరన్. ఆధారిత వృద్ధి నుండి పూర్తిస్థాయి ఉత్పత్తి శ్రేణి సామర్థ్యాల వైపు పయనించడం ప్రాముఖ్యతను కూడా టాటా సన్స్ ఛైర్మన్ నొక్కి చెప్పారు. ప్రధానమంత్రి వికసిత్ భారత్ 2047 దార్శనికత దేశంలోని అన్ని ప్రాంతాలలో, వివిధ రంగాలలో విస్తరించిందని తెలిపారు. కానీ ఆ దార్శనికతను అమలు చేయడానికి ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు, సంస్థలు , మేధో సంపత్తిని సృష్టించడం ద్వారా సమ్మిళిత, సుస్థిర అభివృద్ధి అవసరం అని అభిప్రాయపడ్డారు.
