ఖతార్ : భారత దేశ ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన చేశారు. ప్రస్తుతం కేంద్ర మంత్రి ఖతార్ దేశంలో పర్యటిస్తున్నారు. ఖతార్‌లోని వ్యాపార సంస్థలు వాణిజ్యం, పెట్టుబడి భాగస్వామ్యాలను చురుకుగా పరిశీలించాలని పిలుపునిచ్చారు. ఫిబ్రవరి 2025లో ఖతార్ అమీర్ భారత పర్యటన సందర్భంగా ద్వైపాక్షిక సంబంధాలు ‘వ్యూహాత్మక భాగస్వామ్యం’ స్థాయికి పెరిగిన విషయాన్ని ప్రస్తావించారు ప్రత్యేకంగా. ఖతార్‌తో వాణిజ్యం, పెట్టుబడులను పెంపొందించడానికి భారత్ అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని ఆమె పేర్కొన్నారు. దోహాలో జరిగిన ‘ఖతారీ బిజినెస్‌మెన్ అసోసియేషన్’ రౌండ్ టేబుల్ సమావేశంలో నిర్మలా సీతారామన్ ప్రసంగించారు. ఈ సందర్భంగా రెండు దేశాల్లోనూ ఆవిర్భవిస్తున్న ఆర్థిక అవకాశాలపై చర్చించారు. భారత ఆర్థిక వ్యవస్థ దృఢత్వాన్ని నొక్కి చెప్పారు. 2025-26 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో వాస్తవ జీడీపీ వృద్ధి రేటు 7.8 శాతానికి పెరగడం , ప్రపంచ అనిశ్చితి మధ్య పెట్టుబడులు 11.9 శాతం వృద్ధి చెందడం వంటి అంశాలను ఆమె ప్రస్తావించారు.
అలాగే భారత్‌లో కొనసాగుతున్న నిర్మాణాత్మక సంస్కరణలపై విశ్వాసానికి నిదర్శనంగా జపాన్ క్రెడిట్ రేటింగ్ సంస్థ భారతదేశ దీర్ఘకాలిక జారీదారు రేటింగ్‌ను బిబిబి+ నుండి ఎ- స్థాయికి పెంచడాన్ని కూడా ఆర్థిక మంత్రిత్వ శాఖ హైలైట్ చేసిందన్నారు ఆర్థిక శాఖ మంత్రి. FY26లో భారత్ అత్యధికంగా 94.53 బిలియన్ డాలర్ల వార్షిక స్థూల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల ప్రవాహాన్ని నమోదు చేసిందన్నారు. గత 15 ఏళ్లలో ఇదే అత్యధికం అన్నారు. అంతకు ముందు, ఆర్థిక మంత్రి సీతారామన్ ఖతార్ విదేశీ వాణిజ్య శాఖ సహాయ మంత్రి డాక్టర్ అహ్మద్ బిన్ మహమ్మద్ అల్-సయ్యద్‌తో సమావేశమయ్యారు. డాక్టర్ అల్-సయ్యద్ 2025లో తాను జరిపిన భారత పర్యటనను సానుకూలంగా గుర్తు చేసుకున్నారు. ఓడరేవులు, విమానాశ్రయాలు, రహదారులు , విద్యుత్ వంటి మౌలిక సదుపాయాల రంగాలలో భారత్‌లో పెట్టుబడులకు గణనీయమైన అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు.
