ఢిల్లీ : బెజవాడ టీడీపీ ఎంపీ కేశినేని నాని అలియాస్ చిన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన ప్రధానంగా ఏపీలో విమాన సర్వీసులకు సంబంధించిన సమస్యలను ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఈ మేరకు తమ పార్టీకి చెందిన కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడును ఢిల్లీలోని తన ప్రధాన కార్యాలయంలో కలిశారు. ఈ సందర్బంగా ఏపీలోని గన్నవరం నుంచి ఇతర ప్రాంతాలకు ప్రధానంగా ఢిల్లీకి వెళ్లే ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే ఈ సమస్యను పరిష్కరించాలని కోరారు. విమానాల రాను పోను ఛార్జీలు భరించలేనంత భారంగా మారాయని, దీంతో ఎక్కాలంటే జనం జడుసుకుంటున్నారని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి ఇండిగో ఫ్లైట్ స్పెషల్ డైరెక్టర్ ఎ. కె. సింగ్ తో పాటు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జిల్లా ఎంపీ హరీష్ బాలయోగి ములాఖత్ అయ్యారు కేంద్ర మంత్రితో కేశినేని నాని.
ఈ సమావేశంలో ప్రధానంగా విజయవాడ – హైదరాబాద్ మధ్య విమాన ప్రయాణికుల టికెట్ ఆర్థిక భారం గురించి, సీట్లు అందుబాటులో ఉండక పోవటం, లగేజీ సమస్యలను వివరించారు. పది రోజుల్లో విజయవాడ – హైదరాబాద్ మధ్య వైడ్ – బాడీ విమాన సర్వీసులు ప్రారంభిస్తామని అంగీకరించారు ఎ.క. సింగ్. వైడ్ – బాడీ విమానాలు అందుబాటులోకి వస్తే టికెట్ ధర తగ్గటంతో పాటు సీట్లు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. అలాగే ప్రయాణికుల లగేజీ సమస్య కూడా పరిష్కారం అవుతుందన్నారు. అలాగే విజయవాడ నుంచి వారణాసి, అహ్మదాబాద్, పూణే, కొచ్చిన్, గోవా విమాన సర్వీసులు నడిపించేందుకు రూట్ మ్యాప్ చేసుకొని మొదలు పెడతామని ఇండిగో ఫ్లైట్ స్పెషల్ డైరెక్టర్ తెలిపారు. అమరావతి రాజధాని ప్రాంతంలో భాగమైన విజయవాడ విమానాశ్రయం పైనే ఏలూరు, గుంటూరు, నరసరావుపేట, మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గాల ప్రయాణికులు భారం పడుతుందని, అందువల్ల వారి అవసరాలకు తగ్గట్టుగా విమాన సర్వీసులు ప్రారంభించాలని కోరారు ఎంపీ .
