అమరావతి : కర్ణాటక మాజీ మైనర్ ఇరిగేషన్ మంత్రి ఎన్.ఎస్.బోస్ రాజు, ఎమ్మెల్యే బసవరాజ్ రాయ్ రెడ్డి, ఎమ్మెల్సీ బసవన గౌడ బదర్లి లు మర్యాద పూర్వకంగా ఏపీ రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర భారీ, నీటి పారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడును కలుసుకున్నారు. ఈ సందర్బంగా ఈనెల 25న జరిగే తుంగభద్ర డ్యాం గేట్ల ప్రారంభోత్సవ కార్యక్రమానికి రావాలంటూ కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం నుండి ఆహ్వానం అందించారు. కేంద్రజలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిట్, ఏపి, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల సిఎం లతో కలసి తుంగభద్ర డ్యాం గేట్లను ప్రారంభించ బోతున్నారు.
కర్ణాటక ఎమ్మెల్యేలతో పలు అంతర్రాష్ట్ర జలవనరుల అంశాలపై చర్చించారు ఈ సందర్బంగా మంత్రి నిమ్మల రామానాయుడు. 2024 లో వచ్చిన వరదలకు కొట్టుకు పోయిన తుంగభద్ర డ్యాం 19వ గేటు స్ధానంలో, భారీ వరదలో సైతం స్టాప్ లాగ్ గేట్ ఏర్పాటు చేశారు. స్టాప్ లాగ్ గేట్ ఏర్పాటు చేసి 80 టిఎంసిలను కాపాడి, రాయలసీమకు సాగు, తాగు నీరందించారు. తుంగభద్ర గేట్లు ప్రమాద భరితంగా ఉన్నాయని నిపుణులు సూచించినా, ఐదేళ్లు జగన్ పట్టించు కోలేదని ఆవేదన వ్యక్తం చేశారు మంత్రి నిమ్మల రామానాయుడు.
రాయలసీమ కరువు ప్రాంతానికి జీవనాధారమైన తుంగభద్ర అవసరాన్ని గుర్తించి చంద్రబాబు 6 నెలల్లో కొత్త గేట్ల అమరిక పనులు పూర్తి చేయించారని తెలిపారు. ఇరిగేషన్ రంగంలో అపారమైన అనుభవం కలగిన నిపుణుడు కన్నయ్య నాయుడి సూచనల మేరకు 70 ఏళ్ళ నాటి పాత గేట్ల స్దానంలో, కొత్త గేట్లు ఏర్పాటు చేశారు. ఒక్క సీజన్ లోనే పాతగేట్లు తొలగించి,51 కోట్లతో, 33 కొత్త గేట్లు ఏర్పాటు చేయడం దేశంలోనే రికార్డు అని చెప్పారు నిమ్మల రామానాయుడు.

















