చంద్రగిరి : మంత్రి నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. మూడు రోజుల క్రితం దేవాలయానికి అడ్డుగా ఉన్న కారు తీయమని చెప్పినందుకు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మనుషులు భక్తులపై దాడి చేశారని అన్నారు. భక్తులపై దాడిచేస్తే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు అని వార్నింగ్ ఇచ్చారు. అటువంటి దుశ్చర్యకు పాల్పడే వారిని వదిలిపెట్టే ప్రసక్తి లేదన్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తన రాజకీయ జీవితాన్ని చంద్రగిరి నుంచే ప్రారంభించారని గుర్తు చేశారు. యువగళం పాదయాత్రలో చంద్రగిరి నాకు టర్నింగ్ పాయింట్ గా నిలిచిందన్నారు, ఈరోజు ఇక్కడే నా రాజకీయ పదోన్నతికి సంబంధించి శుభవార్త విన్నాను అని చెప్పారు. అందుకే చంద్రగిరి మాకు అచ్చివచ్చిన నియోజకవర్గం అని చెప్పారు.
తెలుగుదేశం పార్టీలో కార్యకర్తే అధినేత అని స్పష్టం చేశారు నారా లోకేష్. ఇటీవల పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజున చంద్రబాబు పక్కన సామాన్య కార్యకర్తలు కూర్చున్నారని అన్నారు. కార్యకర్తల కోసం సుమారు రూ.150కోట్ల బీమా సొమ్ము వెచ్చించామని తెలిపారు. గత ప్రభుత్వంలో కేడర్ పై పెట్టిన తప్పుడు కేసులన్నీ ఎత్తేస్తాం అని ప్రకటించారు. గతంలో పెండింగ్ లో ఉన్న బిల్లులు చాలావరకు క్లియర్ చేశాం అన్నారు. మిగిలినవి కూడా త్వరలో విడుదల చేస్తాం అని తెలిపారు. కార్యకర్తలను ఆర్థికంగా బలోపేతం చేసే బాధ్యత మేం తీసుకుంటాం అని పేర్కొన్నారు.















