అమరావతి : ఏపీ సర్కార్ వినూత్నంగా విద్యా సంస్థలో తీసుకు వచ్చిన సంస్కరణల కారణంగా 10వ తరగతి ఫలితాలలో గణనీమైన మార్పు కనిపించింది. ఈఏడాది టెన్త్ పరీక్ష ఫలితాలు వెల్లడించారు. భారీ ఎత్తున విద్యార్థులు ప్రతిభను కనబరిచారు. ఇందుకు సంబంధించి ప్రత్యేకంగా యాక్షన్ ప్లాన్ రూపొందించారు. దీనికి అనుగుణంగా చర్యలు చేపట్టారు. ఏ విద్యార్థి ఎందులో బలంగా ఉన్నారు, ఎందులో బలహీనంగా ఉన్నారో ముందుగానే డ్యాష్ బోర్డు విశ్లేషణ పూర్తయ్యింది. దీనికి అనుగుణంగా పాఠశాలకు ఒక సెట్ చొప్పున 15 కార్యాచరణ ప్రణాళిక పుస్తకాలు రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలకు పంపిణీ చేశారు. స్లిప్ టెస్టులలో వెనుకబడిన (Drop-outs) విద్యార్థుల కోసం 30-రోజుల రెసిడెన్షియల్ ప్రోగ్రామ్ ప్రత్యేకంగా నిర్వహించి, వారి పనితీరు మెరుగు పరచడంపై దృష్టి పెట్టారు.
విద్యార్థులలో పరీక్షల ఒత్తిడిని తగ్గించడానికి, ఫలితాలను మెరుగుప రచడానికి ప్రీ-ఫైనల్, గ్రాండ్ టెస్టులు నిర్వహించారు. ఇవి కాకుండా స్కూలులోనే విద్యార్థులకు మధ్యాహ్నం పోషకాలతో కూడిన రుచికరమైన భోజనం, సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర పేరుతో యూనిఫాం, బెల్టు, బ్యాగు, షూ, డిక్షనరీ, టెక్ట్స్ బుక్స్, నోట్ బుక్స్, వర్క్ బుక్స్ అన్నీ ఉచితంగా అందజేశారు. ఎంత మంది పిల్లలు చదివితే వారి తల్లికి ఒక్కొక్కరికీ 15 వేలు చొప్పున తల్లికి వందనం పథకం కింద అందిస్తూ వచ్చారు. ప్రభుత్వం తీసుకున్న చర్యలు, అందించిన సంక్షేమ పథకాలు ఒకవైపు..మరో వైపు కార్యాచరణ ప్రణాళిక, అమలు, పర్యవేక్షణ సమన్వయంగా సాగడంతో టెన్త్‌లో మంచి ఫలితాలు వచ్చాయి.

















