విద్యార్థుల కోస‌మే రాజీనామా చేశా : ధ‌ర్మేంధ్ర ప్ర‌ధాన్

ప్ర‌జాస్వామ్యంపై నాకు న‌మ్మ‌కం ఉంద‌న్న కేంద్ర మంత్రి

hellotelugu-DhaarmendraPradhan

న్యూఢిల్లీ : నీట్ యుజి 2026 ప‌రీక్ష లీక్ కు బాధ్య‌త వ‌హిస్తూ , విద్యార్థుల ఆందోళ‌నతో దిగి వ‌చ్చారు కేంద్ర విద్యా శాఖ మంత్రి ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్. ఈ మేర‌కు ఆయ‌న త‌న ప‌ద‌వికి రాజీనామా చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఈ రాజీనామా లేఖ‌ను దేశ ప్ర‌ధానమంత్రి న‌రేంద్ర మోదీకి అంద‌జేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. భారత ప్రజాస్వామ్య శక్తిపై నాకు ఎప్పుడూ అచంచల విశ్వాసం ఉంది. దేశ యువత ఆశయాలు, కలలు, ఆకాంక్షల పట్ల నాకు అపార గౌరవం ఉందన్నారు. యువత కేవలం దేశ భవిష్యత్తు మాత్రమే కాదు… వికసిత భారత నిర్మాణానికి వారే ప్రధాన శిల్పులు. గత 10 రోజులుగా జరిగిన పరిణామాలను చూసి నా మనసు తీవ్రంగా కలత చెందింది. ఇది నా వ్యక్తిగత ప్రతిష్ఠకు సంబంధించిన విషయం కాదన్నారు ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్. భారత యువశక్తే దేశానికి అసలైన బలం అని పేర్కొన్నారు.

దేశ యువతను అపోహలు, దుష్ప్రచారాల వలలో పడనివ్వ కూడదన్నదే నా సంకల్పం. జంతర్-మంతర్‌తో పాటు దేశ వ్యాప్తంగా ఏర్పడిన పరిస్థితులను దేశ వ్యతిరేక శక్తులు తమ ప్రయోజనాలకు వినియోగించుకోకుండా చూడాల‌న్నారు. దేశ ఐక్యత దెబ్బతినకూడదని పేర్కొన్నారు. దేశంలోని ఒక్క విద్యార్థి భవిష్యత్తు కూడా న్యాయపరమైన చిక్కుల్లో పడకూడదు. విద్యార్థులు తమ సమయాన్ని చదువుకే కేటాయించి, కెరీర్ నిర్మాణంపై దృష్టి పెట్టాలని సూచించారు. ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని నా రాజీనామా పత్రాన్ని ప్రధానమంత్రికి పంపించానని తెలిపారు ధ‌ర్మేంద్ర ప్ర‌దాన్.. నరేంద్ర మోదీ మార్గదర్శనం, నాపై ఉంచిన విశ్వాసం, నిరంతర సహకారానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియ జేస్తున్నాను. నా సహచర మంత్రులు, మంత్రిత్వ శాఖ అధికారులు, సిబ్బంది, నాతో కలిసి పనిచేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు.

Exit mobile version