హైదరాబాద్ : ప్రముఖ నటి, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు . తనకు అసలు నటించడం రానే రాదన్నారు ఓం మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో. దీంతో అందరూ ఆశ్చర్యానికి లోనయ్యారు. ధనుష్ , శ్రీలీల కలిసి నటిస్తున్న చిత్రం ‘ఓం’. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో నిజ జీవిత సంఘటనల ఆధారంగా ఈ సినిమా రూపొందుతోంది. ఇందులో సాయి పల్లవి ఐపీఎస్ అధికారిగా కనిపించనుండగా, నటి రేణు దేశాయ్ కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు . ‘ఓం’ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. ఈ చిత్రం నవంబర్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా విడుదలకు ముందు చిత్ర బృందం హైదరాబాద్‌లో ఒక భారీ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించింది. ఈ కార్యక్రమంలో, తాను ఈ ప్రాజెక్టులో ఎలా భాగస్వామినయ్యానో రేణు దేశాయ్ ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు.
మహా శివరాత్రి రోజున తనకు ‘ఓం’ చిత్రంలో నటించే అవకాశం వచ్చిందని అన్నారు. ఆ రోజు తాను కామాఖ్య ఆలయంలో ఉన్నానని తెలిపారు, ఈ అవకాశం లభించడం పట్ల ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. ఎటువంటి ఆడిషన్ లేకుండానే దర్శకుడు తనను ఎంపిక చేసుకున్నారని చెప్పారు. తనపై నమ్మకం ఉంచి ఈ పాత్రను ఇచ్చినందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. తన గురించి మాట్లాడుతూ రేణు దేశాయ్ ఆశ్చర్యకరమైన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం తనకు 45 ఏళ్లు అని, తన రూపం గురించి ఇక ఆశించాల్సింది ఏమీ లేదని ఆమె సరదాగా వ్యాఖ్యానించారు. అంతేకాకుండా తనకు నిజంగా నటన రాదని ఆమె అంగీకరించారు. తను చేసిన ఈ వినమ్రపూర్వక వ్యాఖ్యలు ప్రేక్షకులను ఆశ్చర్య పరిచాయి.
సీనియర్ నటుడు మమ్ముట్టితో కలిసి పని చేసిన అనుభవం గురించి కూడా రేణు దేశాయ్ మాట్లాడారు. ఆయనకున్న అనుభవం, గొప్పతనం దృష్ట్యా తన ముందు మాట్లాడాలంటేనే తనకు భయంగా, ఆందోళనగా ఉంటుందని పేర్కొన్నారు. సినిమా షూటింగ్ సమయంలో తన పట్ల ఎంతో ఓపికగా వ్యవహరించినందుకు ధనుష్‌కు కృతజ్ఞతలు తెలిపారు. తనకు తమిళం రాదని, తన వల్ల జరిగిన పొరపాట్లను ఆయన మన్నించారని చెబుతూ ధనుష్‌కు ధన్యవాదాలు చెప్పారు.
