హైదరాబాద్ : ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఖైరతాబాద్ నియోజకవర్గం ఎమ్మెల్యే దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. తాను బీఆర్ఎస్ బి ఫారమ్ పై గెలిచినా తాను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నానని స్పష్టం చేశారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు. కొందరు కావాలని తనను బద్నాం చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారంటూ మండిపడ్డారు. తాను ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీనే గెలుస్తుందని, ఆ పార్టీనే పవర్ లో కొనసాగుతుందని జోష్యం చెప్పారు. తాను హస్తం పార్టీని వీడుతున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోందని, ఇది పూర్తిగా అవాస్తవమని పేర్కొన్నారు. ఇదంతా కావాలని చేస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. అయితే ఎవరు పార్టీని మారారో, ఎవరు ఆ పార్టీని వీడారో తనకు తెలియదని చెప్పారు దానం నాగేందర్.
ప్రస్తుతం తాను తమ పార్టీకి చెందిన వారిని రాబోయే హైదరాబాద్ నగర పాలక సంస్థ ఎన్నికల్లో ఎలా గెలిపించాలనే దానిపై సమాలోచనలు చేస్తున్నానని అన్నారు. అంతే తప్పా ఇతర రాజకీయ అంశాల గురించి తాను పట్టించుకోనని పేర్కొన్నారు దానం . నా అంచనా ప్రకారం కాంగ్రెస్ పార్టీతో పాటు ఎంఐఎం అభ్యర్థులు అత్యధిక స్థానాలను గెలుస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. తాము 300 డివిజన్లను కైవసం చేసుకుంటామని చెప్పారు ఖైరతాబాద్ ఎమ్మెల్యే. అంతేకాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన వివిధ పథకాల గురించి ప్రజలకు తెలియ జేయడానికి గ్రేటర్ హైదరాబాద్ అంతటా ప్రచారం చేయనున్నట్లు ఆయన ప్రకటించారు.



















