హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలో చెరువులను కాపాడడమే కాకుండా వాటిని అభివృద్ది చేసే పనిలో పడింది హైడ్రా. ఇందులో భాగంగా ప్రగతినగర్ చెరువు అభివృద్ధికి హైడ్రా కృషి చేస్తోంది. చెరువులో దుర్గంధం వెదజల్లుతున్న పూడికను ఇటీవల తొలగించింది. అంతే కాకుండా చెత్త వేయకుండా రోడ్డు పోడవునా ఫెన్సింగ్ వేసింది. చెరువు మధ్యలో ఉన్న రోడ్డు పొడవునా చికెన్, మాంసం, చేపల విక్రేతలతో పాటు.. బయట దుకాణ దారులు కూడా వ్యర్థాలను పడేస్తున్నారని హైడ్రా ప్రజావాణిలో స్థానికులు ఫిర్యాదు చేశారు. జంతు వ్యర్థాలను ఇలా డంప్ చేయడం వల్ల దుర్వాసన వస్తోందని పేర్కొన్నారు.
ఈ ఫిర్యాదుల నేపథ్యంలో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఆదేశాల మేరకు ముందు అక్కడ పేరుకుపోయిన జంతు వ్యర్థాలను హైడ్రా అధికారులు తొలగించారు. ఇలా 145 లారీల వరకూ పేరుకుపోయిన చెత్తను క్లియర్ చేశారు. అక్కడ వ్యర్థాలను వేస్తున్న దుకాణ దారులకు ప్రత్యామ్నాయ స్థలాన్ని చూపించి కూడా ఖాళీ చేయించారు. చెరువు మధ్యలో ఉన్న రోడ్డు మార్గాన వెళ్తూ చెత్త విసిరేయడానికి అవకాశం లేకుండా 10 మీటర్ల ఎత్తులో హైడ్రా ఫెన్సింగ్ వేశారు. కిలోమీటరున్నర మేర ఫెన్సింగ్ వేసి వ్యర్థాలు చెరువులో పడకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. చెరువులో మురుగు నీరు కలవకుండా.. అభివృద్ధి పనులు త్వరలో హైడ్రా చేపట్టనుంది.
