Hydraa Protect : 4400 గ‌జాల పార్కును కాపాడిన హైడ్రా

ఫెన్సింగ్ వేయ‌డంతో స్థానికుల హ‌ర్షం

Hello Telugu - Hydraa Protect

Hello Telugu - Hydraa Protect

Hydraa : హైద‌రాబాద్ : హైడ్రా దూకుడు పెంచుతోంది. ప్ర‌తి సోమ‌వారం ప్ర‌జల నుంచి ఫిర్యాదుల‌ను స్వీక‌రిస్తోంది. ఈ మేర‌కు స్వ‌యంగా హాజ‌ర‌వుతున్నారు హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్. ఇందులో భాగంగా ఆక్ర‌మ‌ణ‌ల‌ను గుర్తించ‌డం, వాటికి అడ్డుక‌ట్ట వేయ‌డం జ‌రుగుతోంది. తాజాగా రంగారెడ్డి జిల్లా, బండ్ల‌గూడ జాగీర్‌లో 4400 గ‌జాల పార్కు స్థ‌లాన్ని హైడ్రా (Hydraa) కాపాడింది. 96\2, 96\3 స‌ర్వే నంబ‌ర్ల‌లో 125 ఎక‌రాల మేర 582 ప్లాట్ల‌తో పీ అండ్ టీ కాల‌నీ పేరిట 1989లో లే ఔట్ వేశారు. ఇందులోని 1200 గ‌జాల పార్కు ఒక‌టి.. 3200 గ‌జాల‌తో మ‌రో పార్కు స్థ‌లం ఉంది. ఈ రెండింటినీ అభివృద్ధి చేయ‌డానికి వీలు లేకుండా క‌బ్జా చేసిన వారు అడ్డుకుంటున్నారు.

Hydraa Save

బండ్ల‌గూడ జాగీర్ మున్సిపాలిటీ అధికారులు పార్కు చుట్టూ ప్ర‌హ‌రీని నిర్మించి కాపాడేందుకు ప్ర‌య‌త్నించ‌గా క‌బ్జాదారులు అడ్డుకున్నారు.ఈ విష‌యం హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్ దృష్టికి వ‌చ్చింది. దీంతో ఆయ‌న వెంట‌నే చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆదేశించారు. ద‌శాబ్దాలుగా ఈ వివాదం కొన‌సాగుతోంది. దీనిపై హైడ్రా ప్ర‌జావాణికి స్థానికులు ఫిర్యాదు చేశారు. దీంతో హైడ్రా రంగంలోకి దిగింది. లే ఔట్ ఆధారంగా రెవెన్యూ, మున్సిప‌ల్ అధికారుల‌తో క‌లిసి పూర్తి స్థాయి విచార‌ణ చేప‌ట్టింది. పార్కు స్థ‌లాలుగానే నిర్ధారించుకున్న హైడ్రా అధికారులు క‌మిష‌న‌ర్ ఆదేశాల మేర‌కు క‌బ్జాల‌ను తొల‌గించారు. వెనువెంట‌నే పార్కు స్థ‌లాల చుట్టూ ఫెన్సింగ్ వేశారు.

పార్కుల‌ను కాపాడిన‌ట్టు బోర్డులు కూడా పెట్టారు. ద‌శాబ్దాల స‌మ‌స్య‌కు హైడ్రా తెర‌దించిందంటూ స్థానికులు హ‌ర్షం వ్య‌క్తం చేశారు. హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్‌గారితో పాటు అధికారుల‌కు, సిబ్బందికి ధ‌న్య‌వాదాలు తెలిపారు.

Also Read : Trump Sensational Comments : వ్లాదిమిర్ పుతిన్ తో మ‌రోసారి మాట్లాడతా

Exit mobile version