HYDRAA : హైదరాబాద్ – నాలాల్లో వరద సాఫీగా సాగేలా చూడాలని హైడ్రా (HYDRAA) కమిషనర్ ఏవీ రంగనాథ్ స్పష్టం చేశారు. నాలాల్లో ఎక్కడైనా ఆటంకాలుంటే వెంటనే తొలగించాలని ఆదేశించారు. వరద నీరు సాఫీగా సాగితే అనేక ప్రాంతాలకు వరద ముప్పు తప్పుతుందన్నారు. ఈ మేరకు బుల్కాపూర్ నాలాతో పాటు ముషీరాబాద్‌లోని నాలాను హైడ్రా కమిషనర్ క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. అలాగే ప్యాట్నీ నాలా విస్తరణ పనులపై హైడ్రా కార్యాలయంలో సంబంధిత అధికారులతో సమీక్షించారు. సుధూర ప్రాంతాల నుంచి హుస్సేన్‌సాగర్‌కు వర్షపు నీటిని తీసుకువచ్చే బుల్కాపూర్ నాలాలో చెత్త తొలగింపు పనులను పరిశీలించారు.
HYDRAA Commission Serious
టోలీ చౌక్ సమీపంలోని విరాట్‌నగర్ వద్ద 100 మీటర్ల పరిధిలో 50 లారీల చెత్త బయట పడింది. చెత్త అక్కడ బయట వేయకుండా వెనువెంటనే లారీలకు నింపి తరలించాలని హైడ్రా (HYDRAA) కమిషనర్ ఆదేశించారు. ఇరుకు సందులో లారీలు వెళ్లేందుకు వీలు లేకపోయినా.. స్థానికుల సహకారంతో చెత్తను తొలగించే పనులను హైడ్రా ముమ్మరం చేసింది. శంకరపల్లిలోని బుల్కాపూర్ చెరువు నుంచి మొదలైన నాలా.. ఖానాపూర్, నాగులపల్లి దాటి ముందుగా గండిపేటను నింపి.. తర్వాత ఔటర్ రింగురోడ్డు దాటి.. నార్సింగి, పుప్పాలగూడ, మణికొండ, రాయదుర్గం, షేక్‌పేట, టోలీచౌక్‌లోని హకీంపేట, మెహిదీపట్నం, బంజారాహిల్స్ రోడ్డు నంబరు 12, చింతలబస్తీ, తుమ్మలబస్తీ, ఖైరతాబాద్ చౌరస్తా మీదుగా హుస్సేన్ సాగర్‌కు చేరుతోంది. ఇలాంటి చారిత్రక నాలాలో పేరుకు పోయిన చెత్తను తొలగిస్తున్న హైడ్రాకు స్థానికులు ధన్యవాదాలు తెలిపారు.
ముషీరాబాద్ నియోజకవర్గం అడిక్‌మెట్ డివిజన్ పరిధిలోని పద్మా కాలనీలో ఇటీవల కూలిపోయిన నాలా రిటైనింగ్ వాల్ పరిసరాలను హైడ్రా కమిషనర్ పరిశీలించారు. రిటైనింగ్ వాల్ కూలడంతో ప్రమాదకరంగా మారిన రెండు ఇళ్లను ఇటీవల హైడ్రా ఖాళీ చేయించిన విషయం విధితమే. వెంటనే రిటైనింగ్ వాల్ నిర్మించాలని ఆదేశించారు. 6 నుంచి 8 మీటర్ల వెడల్పుతో దాదాపు 500ల మీటర్ల మేర బాక్సు డ్రైన్ నిర్మించి.. పైన వాహనాల రాకపోకలకు అవకాశం కల్పించాలని అక్కడి స్థానికులు హైడ్రా కమిషనర్‌ను కోరారు. ఈ ప్రతిపాదనను పరిశీలించి తగు నిర్ణయం తీసుకుంటామని కమిషనర్ చెప్పారు. రిటైనింగ్ వాల్‌ను వెంటనే నిర్మించాలని కమిషనర్ సూచించారు.
Also Read : AI Effective Layoffs : ఏఐ ఎఫెక్ట్ మైక్రోసాఫ్ట్‌లో భారీ కోత















