అమరావతి : బీసీల హక్కుల సాధన కోసం బీసీవై పార్టీ అధినేత బోడె రామచంద్ర యాదవ్ చేపట్టిన “బీసీ ధర్మదీక్ష” తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. మూడు రోజులుగా నిరాహారంగా ఉన్న ఆయన ఆరోగ్యం విషమిస్తోందని వైద్యులు ప్రకటించడంతో ఇప్పటికే ఆందోళనతో ఉన్న బీసీవై శ్రేణులను, కొందరు వ్యక్తులు రెచ్చగొట్టడంతో పరిస్థితి ఒక్కసారిగా అదుపు తప్పింది.
దీక్షా శిబిరం వద్దకు చేరుకున్న కొంతమంది శాంతియుతంగా ఉన్న బీసీవై పార్టీ కార్యకర్తలను రెచ్చగొట్టేలా ప్రవర్తిస్తూ హల్‌చల్ సృష్టించారు. తమ నాయకుడు ప్రాణాలకు తెగించి దీక్ష చేస్తుంటే, ఇలా రెచ్చగొట్టే చర్యలకు పాల్పడటంతో బీసీవై శ్రేణులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యాయి. ప్రభుత్వ నిర్లక్ష్యానికి, టీడీపీ నేతల దురుసు ప్రవర్తనకు నిరసనగా వందలాది మంది కార్యకర్తలు ఒక్కసారిగా మంగళగిరి వద్ద గుంటూరు-విజయవాడ జాతీయ రహదారిపైకి దూసుకొచ్చి, దిగ్బంధించారు. దీంతో జాతీయ రహదారిపై కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించి, తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
అంతకు ముందు, ఆరోగ్యం క్షీణిస్తున్నప్పటికీ దీక్షా శిబిరం నుంచి మాట్లాడారు బోడె రామచంద్ర యాదవ్. బీసీల ఐదు న్యాయమైన డిమాండ్లు పరిష్కారం అయ్యే వరకు దీక్షను విరమించే ప్రసక్తే లేదని పునరుద్ఘాటించారు. దీక్షను భగ్నం చేయాలని ప్రయత్నిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని, దానికి పూర్తి బాధ్యత ప్రభుత్వానిదేనని హెచ్చరించారు. ప్రభుత్వం స్పందించడం కాదు, స్పష్టమైన పరిష్కారం ప్రకటించేంత వరకు దీక్ష కొనసాగుతుందని తేల్చి చెప్పారు.
రామచంద్ర యాదవ్ దీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా మద్దతు వెల్లువెత్తుతోంది. వంగవీటి మోహనరంగా కుమార్తె ఆశా వంగవీటి, ప్రముఖ పారిశ్రామికవేత్త కోగంటి సత్యనారాయణ, లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, మాజీ ఐఏఎస్ అధికారి విజయకుమార్, ముస్లిం సంక్షేమ సమితి రాష్ట్ర అధ్యక్షులు మొహమ్మద్ ముక్తర్ అలీ, మాజీ హిస్టరీ బోర్డు డైరెక్టర్ వాజీద్ ఖాన్, శాలివాహన సంఘం స్టేట్ ప్రెసిడెంట్ ఇలాపురం శ్రీనివాస్, బీసీ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఎన్.వి. రావు తదితరులు దీక్షా శిబిరానికి విచ్చేసి బోడె రామచంద్ర యాదవ్‌కు సంఘీభావం తెలిపారు.

















