హైదరాబాద్ : హైడ్రా దూకుడు పెంచింది. ప్రతి సోమవారం ప్రజా వాణి నిర్వహిస్తూ వస్తోంది. మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా కుత్బుల్లాపూర్ మండలం గాజుల రామారం విలేజ్ సర్వే నంబర్ 307 లోని ప్రభుత్వ భూమిలో ఇళ్ళు కట్టుకుని నివాసం ఉంటున్న వారికి హైడ్రా భరోసా ఇచ్చింది. ఇప్పటికే నివాసం ఉంటున్న పేదలను ఖాళీ చేయించమని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ స్పష్టం చేశారు. పేదల ఇళ్లను మినహాయించి మిగిలిన ప్రభుత్వ భూమిని కాపాడుతామన్నారు. వదంతలు నమ్మి ఆందోళన చెందవద్దని సూచించారు. సర్వే నంబరు 307లో నివాసం ఉంటున్న పేదలు ఆందోళన చెందుతున్న నేపథ్యంలో హైడ్రా కమిషనర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అక్కడ నివాసం ఉంటున్న వారితో హైడ్రా కమిషనర్ నేరుగా మాట్లాడారు.
ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన పని లేదని భరోసా ఇచ్చారు. నగరంలో ఎక్కడ కూడా పేదల నివాసాలను హైడ్రా తొలగించదని చెప్పారు. ఎవరైనా హైడ్రా పేరు చెప్పి మోసాలకు పాల్పడితే నేరుగా హైడ్రా కార్యాలయానికి వచ్చి ఫిర్యాదు చేయాలని సూచించారు. ఇదే సమయంలో అక్కడ కొత్తగా ఇళ్ల నిర్మాణాలు జరగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ప్రగతినగర్ (అంబీర్ చెరువు) చెరువు మధ్యలోంచి సాగే రహదారికి ఇరువైపులా ఉన్న చిరు వ్యాపారులకు ప్రత్యామ్నాయ స్థలం చూపించాలని అధికారులను హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఆదేశించారు.
