శ్రీ సత్యసాయి పుట్టపర్తి జిల్లా : మానవీయ విలువలను పెంపొందించేందుకు ప్రయత్నం చేసిన గొప్ప వ్యక్తి శ్రీ సత్యసాయి బాబా అని కొనియాడారు ప్రముఖ బాలీవుడ్ నటి ఐశ్వర్య రాయ్ బచ్చన్. సత్య సాయి శతాబ్ది ఉత్సవాలు బుధవారం పుట్టపర్తిలో జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, సీఎం నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో పాటు భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ , క్రికెట్ లెజెండ్ సచిన్ రమేష్ టెండూల్కర్ ,మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్బంగా ఐశ్వర్య రాయ్ బచ్చన్ శ్రీ సత్యసాయి బాబాతో తనకు ఉన్న అనుబంధం గురించి గుర్తు చేసుకున్నారు.
ఈ ప్రపంచంలో ఒకే ఒక కులం ఉంది. అది మానవత్వం అనే కులం. ఒకే మతం ఉంది అది ప్రేమ అనే మతం. ఒకే భాష ఉంది అది హృదయానికి సంబంధించిన భాష. ఒకే దేవుడు ఉన్నాడు. ఆయన సర్వాంతర్యామి అని పేర్కొన్నారు. ఇవాళ మాతో ఇక్కడ ఉన్నందుకు, ఈ ప్రత్యేక సందర్భాన్ని గౌరవించినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జీకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియ జేస్తున్నానని అన్నారు. ఎప్పటిలాగే ప్రభావ వంతమైన, స్ఫూర్తి దాయకమైన మీ తెలివైన మాటలను వినడానికి నేను ఎదురు చూస్తున్నానని చెప్పారు. మనిషికి సేవ చేయడం దేవునికి సేవ అనే స్వామి సందేశాన్ని గుర్తు చేస్తుందన్నారు. ఈ సందర్భంగా శ్రీ సత్యసాయి బాబా చెప్పిన ఐదు విలువైన లక్షణలు ప్రస్తావించారు. క్రమశిక్షణ, అంకితభావం, భక్తి, దృఢ సంకల్పం , వివక్ష లేని ప్రేమ అని పేర్కొన్నారు.
