హైదరాబాద్ : మాజీ మంత్రి , బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన గతంలో బీఆర్ఎస్ హయాంలో ఆర్థిక శాఖ మంత్రిగా పని చేశారు. ఇదే సమయంలో తను అనుకోకుండా ఆ పార్టీ నుండి గెంటి వేయబడ్డారు. ఆ తర్వాత బీజేపీలో చేరారు. ఎమ్మెల్యేగా హుజారాబాద్ లో పాడి కౌశిక్ రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. పార్టీ తనను నమ్మి మల్కాజ్ గిరి ఎంపీ టికెట్ ఇచ్చింది. భారీ మెజారిటితో గెలుపొందారు. ఇప్పుడు బీజేపీలో తనదైన గొంతు వినిపించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం ఆధిపత్య పోరు పార్టీలో నడుస్తున్నప్పటికీ తనదైన పనితీరుతో ఆకట్టుకుంటున్నారు. శుక్రవారం ఈటల రాజేందర్ మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ హయాంలో నిర్మించిన భారీ ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ప్రత్యేకంగా స్పందించారు.
ఏమన్నా ఙ్ఞానముందా అంటూ తీవ్రస్థాయిలో విరుచుకు పడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టులో లక్ష కోట్ల అవినీతి అంటూ చేస్తున్న విమర్శలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఒక్క మేడిగడ్డ బ్యారేజీ మాత్రమే కాదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో లక్ష్మి, అన్నారం, సుందిళ్ల, మిడ్ మానేరు, అనంత సాగర్, రంగనాయక్ సాగర్, మల్లన్న సాగర్, కొండ పోచమ్మ సాగర్, బస్వాపూర్ ఇన్ని బ్యారేజులు, వందల కిలోమీట్లర్ల కాలువలు ఉన్నాయని అన్నారు. ప్రాజెక్టుకు లక్ష కోట్లు ఖర్చు పెడితే లక్ష కోట్లు తిన్నారు అనడానికి కొద్దిగైనా జ్ఞానం ఉండాలి కదా అని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టు కొన్ని వందల టీఎంసీల రిజర్వాయర్, కొన్ని వందల కిలోమీటర్ల పైప్ లైన్లు, కొన్ని వందల కిలోమీటర్ల కాలువలు, పదుల సంఖ్యలో టన్నెల్స్, మోటార్లు ఇలా అనేకం ఉన్నాయని ఈటల చెప్పడం కలకలం రేపుతోంది.
