రూ. 9,355 కోట్ల తాగునీటి ప్రాజెక్టులకు కేబినెట్ ఆమోదం

అధ్యక్ష‌త వ‌హించిన సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు

hellotelugu-APCabinet

అమ‌రావ‌తి : ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు అధ్యక్ష‌త‌న శుక్ర‌వారం ఏపీ మంత్రివ‌ర్గం కీల‌క స‌మావేశం నిర్వ‌హించింది. ఈమేర‌కు రూ. 9,355 కోట్ల తాగునీటి ప్రాజెక్టులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. విధానపరమైన నిర్ణయాలు తీసుకుంది స‌ర్కార్. ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశంలో మౌలిక సదుపాయాలు, సంక్షేమం, పెట్టుబడులకు సంబంధించిన 30కి పైగా అంశాలకు ఆమోదం లభించింది. గ్రామీణ ప్రాంతాల్లో 10 బహుళ-గ్రామ తాగునీటి సరఫరా పథకాల కోసం రూ. 9,355 కోట్లను మంత్రివర్గం ఆమోదించింది. అలాగే, నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాల్లో రూ. 1,811 కోట్ల విలువైన 2,943 తాగునీటి ప్రాజెక్టులకు పరిపాలనా పరమైన అనుమతిని మంజూరు చేసింది. కీలక నిర్ణయాల్లో భాగంగా, విశాఖపట్నంలో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) ప్రత్యేక కోర్టు ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. తిరుపతి జిల్లాలో 63 ఎకరాల విస్తీర్ణంలో లాజిస్టిక్స్ పార్క్ ఏర్పాటుపై కూడా చర్చించింది.

పర్యాటక రంగాన్ని ప్రోత్సహించేందుకు, రాష్ట్రంలో సంగీత కచేరీల నిర్వహణకు ప్రత్యేక విధానాన్ని ఆమోదించడంతో పాటు పర్యాటక ప్రచారం కోసం రూ. 50 కోట్లు మంజూరు చేసింది. నెల్లూరులోని ఐటీసీ హోటల్, కడపలోని మాధవి హోటల్, విజయవాడలోని సరోవర్ పోర్టికో వంటి హాస్పిటాలిటీ ప్రాజెక్టులకు, అలాగే కడపలో ఇంటిగ్రేటెడ్ అమ్యూజ్‌మెంట్ పార్క్‌కు ప్రోత్సాహకాలను కూడా మంత్రివర్గం ఆమోదించింది. విద్యా రంగంలో, విశాఖపట్నం, గుంటూరు, నెల్లూరులలో ‘అంబేద్కర్ గురుకుల సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్’ ఏర్పాటుకు ఆమోదం లభించింది. ఐఐటీ-జేఈఈ , నీట్ అభ్యర్థులకు రెసిడెన్షియల్ కోచింగ్ కల్పించే ప్రతిపాదనలకు కూడా మంత్రివర్గం ఆమోదం తెలిపింది. పెద్దగడ్డ రిజర్వాయర్ ఆయకట్టు ఆధునీకరణ, కుప్పంలో ఫీడర్ ఛానెల్స్ , బీరగానిపల్లె రిజర్వాయర్ వంటి నీటిపారుదల , మౌలిక సదుపాయాల ప్రతిపాదనలకు కూడా ఆమోదం లభించింది.

Exit mobile version