అమరావతి : రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఇళ్ల నిర్మాణం వేగవంతం చేసేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. నిన్న, ఇవాళ జరిగిన జిల్లా కలెక్టర్ల ప్రత్యేక సదస్సులో ఆయన పాల్గొని ప్రసంగించారు. రాష్ట్ర అభివృద్ది, సంక్షేమంపై కీలక సూచనలు చేశారు. ప్రధానంగా గృహ నిర్మాణం, పేదల ఇళ్ల పట్టాలు, ఇళ్ల స్థలాల క్రమబద్దీకరణపై చర్చించారు. ఏపీ కూటమి ప్రభుత్వం ఇళ్ల నిర్మాణాలపై ఎక్కువగా ఫోకస్ పెట్టిందని చెప్పారు. ప్రస్తుతానికి 1.43 లక్షల మందికి ఇళ్ల పట్టాల అర్హులను గుర్తించినట్టు అధికారుల వెల్లడించారు. మరో 1.26 లక్షల మంది దరఖాస్తులను పరిశీలిస్తోన్నట్టు తెలిపారు సీఎంకు. వచ్చే నెల 15వ తేదీ నాటికి పరిశీలన పూర్తి చేస్తామని పేర్కొన్నారు.
1692 గ్రామాల్లో 18 వేల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు అవసరమైన భూమిని గుర్తించామన్నారు. ఇళ్ల పట్టాల పంపిణీ ప్రక్రియను ఏడాదిలోపు పూర్తి చేయాలని స్పష్టం చేశారు సీఎం నారా చంద్రబాబు నాయుడు. ఇళ్ల పట్టాలు ఎంత మందికి ఇవ్వాలి..? ఎంత మందికి పట్టాలను రెగ్యులరైజ్ చేయాలి అనే అంశాలపై జాబితా సిద్దం చేయాలని ఆదేశించారు. ప్రస్తుతం ఎన్ని ఇళ్లు నిర్మాణంలో ఉన్నాయనే అంశంపై ముఖ్యమంత్రి ఆరా తీశారు. ఇప్పటి వరకు 5.92 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి అయ్యాయని… ఇంకా 5.32 లక్షల ఇళ్లు వివిధ స్థాయిల్లో నిర్మాణాల్లో ఉన్నాయని చెప్పారు. వచ్చే ఏడాది మార్చి నాటికి నిర్మాణంలో ఉన్న ఇళ్లను అందుబాటులోకి తేవాలని స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరికీ ఇల్లూ.. లేదా ఇళ్ల పట్టా ఇచ్చేలా చూడాలని స్పష్టం చేశారు. ఇళ్లు, ఇళ్ల పట్టాల విషయమై టైమ్ బౌండ్ ప్రొగ్రాం పెట్టుకుని పని చేయాలని అన్నారు. గృహ నిర్మాణాలను, ఇళ్ల పట్టాల అంశాన్ని జిల్లా కలెక్టర్లు హై ప్రయార్టీ ఇవ్వాలని ఆదేశించారు.
