Heavy Rains : అమరావతి – ఉత్తర బంగాళాఖాతంలో అల్ప పీడనం కేంద్రీకృతమై ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ (ఐఎండీ ) మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ వెల్లడించారు. ఇది రానున్న 24 గంటల్లో పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ తీరాలను ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతంలో మరింత బలపడేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయన్నారు. ఇది ఆ తదుపరి 48 గంటల్లో పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒడిశా తీరాల వైపు కదులేందుకు అవకాశం ఉందని ప్రఖర్ జైన్ పేర్కొన్నారు. దీని ప్రభావంతో కోస్తాంధ్రలో ఆదివారం వరకు అక్కడక్కడ భారీ వర్షాలు నమోదైయ్యేందుకు ఛాన్స్ ఉందన్నారు. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్ళరాదని సూచించారు. పిడుగులతో కూడిన వర్షాల (Heavy Rains) నేపధ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.
AP Heavy Rains – IMD Comments
అల్ప పీడనం ప్రభావంతో శుక్రవారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు,కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందని వెల్లడించారు. మిగతా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసేందుకు ఆస్కారం ఉందని తెలిపారు.
జూలై 26న శనివారం ఉత్తరాంధ్రలో అక్కడక్కడ మోస్తారు నుంచి భారీ వర్షాలు, మిగతా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఎండీ ప్రఖర్ జైన్ స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా నిన్న మన్యం జిల్లా సీతంపేటలో 5 8మిమీ, శ్రీకాకుళం జిల్లా మందసలో 49.7 మిమీ, అల్లూరి జిల్లా ముంచింగిపుట్టులో 44.5 మిమీ, చింతపల్లిలో 41.5 మిమీ, వజ్రపు కొత్తూరులో 40.7 మిమీ వర్షపాతం రికార్డైందన్నారు.
Also Read : Minister BC Janardhan Reddy Alarming : ఏవియేషన్ హబ్ గా ఆంధ్రప్రదేశ్
